కన్నడలో మాట్లాడిన బాలకృష్ణ.. అటు తిప్పి ఇటు తిప్పి మడతెట్టేశారు..!!

సినిమాల్లో చాంతాడంత డైలాగులు గుక్కతిప్పుకోకుండా అవలీలగా చెప్పేసే నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. బయట వేదికలపై మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త తడబడతారనే విమర్శలు ఉన్నాయి. కల్మషం అంటే ఏంటో తెలియని బాలయ్య.. మనసులో ఏదనుకుంటే అది బయటికి అనేస్తారు. ముందుగా ప్రిపేర్ అవ్వడం లాంటివి బాలయ్య దగ్గర ఉండదని ఇండస్ట్రీలో చాలా మంది చెప్పే మాట. అందుకే, వేదికపై మాట్లాడేటప్పుడు పద్యాలు అవలీలగా చెప్పేసే బాలయ్య.. పదాలను మాత్రం ఏరుకుంటూ, కూర్చుకుంటూ ఉంటారు. దీంతో ఆయన మాటల మధ్య గ్యాప్ ఎక్కువైపోతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే, మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘శివ వేద’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ కన్నడలో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొన్ని కన్నడ మాటలను పేపర్‌పై రాసుకొని వచ్చారు. అయినప్పటికీ కన్నడలో పదాలను కూర్చడం బాలయ్య వల్ల కాలేకపోయింది. పక్కనే ఉన్న హీరో శివ రాజ్‌కుమార్ ప్రాప్టింగ్‌తో కన్నడను అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి మడతెట్టేశారు బాలయ్య. తాను కన్నడలో మాట్లాడుతున్న వాక్యాలకు తెలుగులో అర్థాలు కూడా చెప్పుకుంటూ వెళ్లారు. ‘శివ వేద’ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆఖరిగా కన్నడలో శివ రాజ్‌కుమార్‌కు బాలయ్య చెప్పారు.

‘‘ట్రై చేస్తున్నా కన్నడలో మాట్లాడటానికి.. ఏదో రాసిచ్చారు’’ అని ఎలాంటి దాపరికం లేకుండా పేపర్ కూడా చూపించారు బాలకృష్ణ. అయితే, ఆ పేపర్ మారిపోయిందో ఏమో మధ్యలో ఒక వ్యక్తి వేదికపైకి వచ్చి బాలయ్యకు మరో పేపర్ అందించారు. శివ రాజ్‌కుమార్‌ను తెలుగునాడుకి స్వాగతిస్తూ బాలయ్య చెప్పిన మాటలకు శివన్న కూడా నవ్వేశారు. పాపం అంతలా మడతెట్టేశారు బాలయ్య.

97727434

శాండిల్‌వుడ్ స్టార్ హీరో అయిన శివ రాజ్‌కుమార్ కన్నడలో నటించి, నిర్మించిన చిత్రం ‘వేద’. తన భార్య గీతా శివ రాజ్‌కుమార్ పేరిట గీతా పిక్చర్స్ అని బ్యానర్ పెట్టి ఆమె నిర్మాతగా ఈ సంస్థలో నిర్మించిన తొలి చిత్రం ‘వేద’. ఇప్పటికే కర్ణాటకలో విడుదలైన ఈ సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి అనువాదం చేసి ‘శివ వేద’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 9న ‘శివ వేద’ సినిమా విడుదలవుతోంది.

హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అర్జున్ జన్య సంగీతం సమకూర్చారు. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. దీపు ఎస్ కుమార్ ఎడిటర్. శివ రాజ్‌కుమార్ సరసన గానవి లక్ష్మణ్ హీరోయిన్‌గా నటించారు. ఇది శివ రాజ్‌కుమార్‌కు 125వ సినిమా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *