యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రాబోయే సినిమా (NTR 30) కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ప్రకటించి ఏడాది దాటిపోయినా ఇంకా షూటింగ్ ప్రారంభంకాకపోవడంపై అభిమానులు ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నారు. ఈ సినిమా అప్‌డేట్స్ కావాలంటూ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌పై కూడా సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న కొన్ని లీక్స్ ఎన్టీఆర్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా కనిపిస్తున్నాయి.
NTR 30 మూవీ సముద్రంలోని ఒక చిన్న ద్వీపంలో ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం ఒక కల్పిత ద్వీపాన్ని సృష్టించారని.. అలాగే పోర్టు సెటప్ కూడా ఉందని సమాచారం. పోర్టు బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ సినిమా కథ సాగుతుందని అంటున్నారు. ఈ సినిమా కథ కొన్నేళ్ల క్రితం జరిగినట్టుగా దర్శకుడు చూపించబోతున్నారని చెబుతున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఐల్యాండ్ సెట్ వేశారని.. అలాగే విశాఖపట్నం, గోవాలో కూడా షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా, అత్యధికంగా వీఎఫ్ఎక్స్ కూడా ఉంటాయని సమాచారం.
అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం పరభాషా నటుడిని తీసుకోవాలని చూస్తున్నారట. ముఖ్యంగా తమిళం నుంచి చియాన్ విక్రమ్, హిందీ నుంచి సైఫ్ అలీ ఖాన్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. వీళ్లద్దరిలో ఒకరిని ఫైనల్ చేసుకుని సంప్రదిస్తారని.. ఆ తరవాత అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. మరి కీలక పాత్ర అంటే విలనా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఒక వేళ విలన్‌గా అయితే సైఫ్ అలీ ఖాన్ కన్నా విక్రమ్ అయితేనే అదిరిపోతుందేమో. నిజానికి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల అభిప్రాయం కూడా ఇదే. మాకు సైఫ్ అలీ ఖాన్ వద్దు విక్రమే ముద్దు అంటున్నారు.
ఇదిలా ఉంటే, NTR 30 అప్‌డేట్స్ కోసం అభిమానులు పడుతున్న ఆత్రుతకు ఎన్టీఆర్ ఇటీవలే బ్రేక్ వేశారు. ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఎన్టీఆర్.. NTR 30 మూవీ అప్‌డేట్స్ కోసం నిర్మాణ సంస్థను, దర్శకుడిని ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ఈ నెలలో పూజా కార్యక్రమం జరుపుకుని వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెడతామని హామీ ఇచ్చారు. ‘‘ప్రతిసారి అప్‌డేట్ అంటే ఏముంటుంది. సినిమాను అత్యుత్తమ నిర్మాణ విలువలతో అందించాలంటే సెట్స్ మీదికి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల అప్‌డేట్స్ ఎక్కడా అని పదేపదే అడిగితే నిర్మాతలు, దర్శకుడు ఒత్తిడికి లోనవుతారు. అది మంచిది కాదు’’ అని ఎన్టీఆర్ క్లాస్ తీసుకున్నారు.