జగిత్యాలలో నన్ను కోడిగుడ్లతో కొట్టారు: చిరంజీవి

తెలుగు సినీ పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు కొణిదెల శివశంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి (Chiranjeevi). అయితే, కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు.. జీవితంలో ఎదిగే వారికే ప్రశంసలతో పాటు అవమానాలూ, విమర్శలు ఎదురవుతాయి. చిరంజీవికి కూడా అలాంటి అవమానాలు చాలానే ఎదురయ్యాయట. ఒకసారి జగిత్యాల వెళ్లినప్పుడు అక్కడ అభిమానులు తనపై పూల వర్షం కురిపించారని.. అయితే, కాస్త ముందుకు వెళ్తే కోడిగుడ్లతో తనను కొట్టారని చిరంజీవి వెల్లడించారు. ప్రముఖ గాయని, తెలుగు పాప్ సింగ్ స్మిత (Smita) హోస్ట్ చేస్తోన్న సరికొత్త టాక్ షో ‘నిజం విత్ స్మిత’లో (Nijam With Smita) చిరంజీవి ఈ విషయాలు చెప్పారు.

ప్రస్తుతం సెలబ్రిటీ టాక్ షోల హవా నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ నిర్వహిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో విశేష ఆదరణ పొందుతోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో రెండు సీజన్‌లను పూర్తి చేసుకుంటోంది. మోహన్ బాబు, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి సినీ ప్రముఖలతో పాటు.. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి రాజకీయ ప్రముఖులను సైతం బాలయ్య ఇంటర్వ్యూలు చేశారు. ఇక ఈ మధ్యే యాంకర్ సుమ ఈటీవీలో ‘సుమ అడ్డా’ అనే టాక్ షో ప్రారంభించారు. ఈ టాక్ షో తొలి ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవిని తీసుకొచ్చారు. ఇప్పుడు స్మిత హోస్ట్ చేస్తోన్న ‘నిజం విత్ స్మిత’ షో తొలి ఎపిసోడ్‌కు కూడా మెగాస్టారే వచ్చారు.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్‌లో ఈ ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ప్రసారం కానుంది. ఈనెల 10 నుంచి ఈ టాక్ షో మొదలుకాబోతోంది. చిరంజీవి పాల్గొన్న తొలి ఎపిసోడ్ ఈనెల 10 నుంచి సోనీ లివ్‌లో అందుబాటులోకి వస్తుంది. అయితే, ఈ ఎపిసోడ్‌కు సంబంధించి 30 సెకెండ్ల చిన్న ప్రోమోను నిన్న విడుదల చేశారు. తొలి ఎపిసోడ్‌కు చిరంజీవి గెస్ట్ అని చెప్పడానికి ఈ ప్రోమో వదిలినట్టుంది. ఆవకాయ బద్దను చూపించి కనీసం దాన్ని రుచి చూడకుండానే పట్టుకుపోయినట్టు.. ఈ ప్రోమోలో కూడా చిరంజీవిని అలా చూపించి ఇలా మాయం చేసింది. అయితే, ఉన్న ఆ 30 సెకెండ్లలోనూ ఆసక్తికర ప్రశ్నలే ఉన్నాయి.

‘కాలేజ్ డేస్‌లో మీ ఫస్ట్ క్రష్ ఎవరు’ అని స్మిత అడగ్గానే.. చిరంజీవి ఎక్స్‌ప్రెషన్ అదిరిపోయింది. ఎప్పటిలానే నేను చాలా అమాయకుడిని అన్నట్టు అన్నయ్య పెట్టిన ఎక్స్‌ప్రెషన్ అభిమానులను కట్టిపడేస్తుంది. ‘స్టార్‌డమ్ అనేది కొంత మందికే.. ఆ స్టేజ్‌కి వెళ్లాలంటే అవమానాలు, అనుమానాలు’ అంటూ స్మిత అడుగుతున్న ప్రశ్నను మధ్యలోనే ఆపేశారు. అంటే, చిరంజీవి ఎదుగుతున్న క్రమంలో ఆయనకు ఎదురైన అమానాల గురించి స్మిత అడిగినట్టు స్పష్టమవుతోంది. దీనికి చిరంజీవి సమాధానం ఇస్తూ.. ‘జగిత్యాలలో, అక్కడ నాకు పైనుంచి పూలవర్షంలా కురిసింది. కొంచెం ముందుకు వెళ్లగానే కోడిగుడ్లేసి కొట్టారు’ అని చెప్పారు. మరి ఇది ఏ సందర్భంలో.. ఆయన జగిత్యాల ఎప్పుడు వెళ్లారు.. వంటి విషయాలు పూర్తి ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

అలాగే, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులను స్మిత ప్రస్తావిస్తూ.. ‘ఒక వరప్రసాద్ నుంచి మెగాస్టార్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉందంటారా?’ అని అడిగారు. మరి దీనికి చిరంజీవి ఏం సమాధానం చెప్పారు అనేది ఈనెల 10వ తేదీన స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్‌లో చూడాలి. ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం ‘భోళా శంకర్’ సినిమతో బిజీగా ఉన్నారు. అజిత్ హీరోగా తమిళంలో 2015లో వచ్చిన ‘వేదాళం’ సినిమాకు ఇది రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్.. చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్నారు. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా కనిపంచనున్నారు. వెన్నెల కిషోర్, అర్జున్ దాస్, రష్మి గౌతమ్, తులసి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *