తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 23 నుంచి 28 వరకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల (Tirumala Accommodation)ను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే ఈ నెల 22 నుంచి 28 వరకు శ్రీవారి ఆర్జిత సేవాటికెట్ల (Tirumala Arjitha Seva Tickets) ఆన్‌లైన్ డిప్‌లో పాల్గొనేందుకు భక్తులు బుధవారం ఉదయం 10 నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలియజేసింది.
ఈ నెల 22 నుంచి 28 వరకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈనెల 22 నుంచి 28 తేదీ వరకు శ్రీవారి వర్చువల్ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. భక్తులు టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు వెబ్‌సైట్, యాప్‌లో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. టీటీడీ ఇటీవలే భక్తుల కోసం.. టికెట్ల బుకింగ్‌తో పాటూ తిరుమల సమాచారాన్ని అందుబాటులోకి తెస్తూ యాప్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
మరోవైపు టీటీడీ గోశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. అధికారులతో కలసి మంగళవారం ఆమె ఈ పనుల ప్రగతిని పరిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ లో చివరి దశలో ఉన్న సివిల్, విద్యుత్ , యంత్రాల పనితీరు పరిశీలన పనులు వారం రోజుల్లోపు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
అనంతరం ఆమె అగరబత్తీల తయారీ రెండో యూనిట్ పనులు పరిశీలించి.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి అవసరమైన పూల సరఫరా.. ఇతర ఏర్పాట్ల గురించి జేఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటుతో గోశాలలోని గోవులు, ఎద్దులు, ఇతర జంతువులకు నాణ్యమైన దాణా తయారు చేసి అందించవచ్చునన్నారు జేఈవో. భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో అగరబత్తీల ఉత్పత్తిని డబుల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు జేఈవో వివరించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల రెండో యూనిట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.
Read Latest
Andhra Pradesh News
and