నీళ్లలో మునిగి చనిపోయిన వ్యక్తిని ఉప్పుతో కప్పి బతికించొచ్చా..?

మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎంతో మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 3 లక్షల మందికిపైగా నీట మునిగి మరణిస్తున్నారని అంచనా. దీంతో ఇలాంటి మరణాలను తగ్గించడం కోసం ఏటా జూలై 25న ‘వరల్డ్ డ్రౌనింగ్ ప్రివెన్షన్ డే’గా జరుపుతున్నారు. మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా నీట మునగడం వల్ల సంభవించే మరణించే వారిలో పురుషులే ఎక్కువ. అందులోనూ 24 ఏళ్ల లోపు వయసు వారే ఎక్కువ. మహిళలతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో పురుషులు నీట మునిగి చనిపోతున్నారట. మన దేశంలో నీట మునిగి చనిపోయేవారిలో 78 శాతం మంది పురుషులే.

నీట మునిగి యువకుడి మృతి, చెరువులో మునిగి చిన్నారుల దుర్మణం అంటూ.. తరచుగా మీడియాలో కథనాలు చూస్తూనే ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. అయితే నీళ్లలో పడి మరణించిన వారిని ఉప్పు సాయంతో తిరిగి బతికించొచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నీట మునిగి చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఉప్పులో ఉంచితే కాసేపటి తర్వాత అతడికి మెలకువ వస్తుందనేది ఆ ప్రచారం సారాంశం. ఇది చాలా కాలంగా ప్రచారంలో ఉన్నదే. కానీ మరోసారి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైంది.

ఎవరైనా నీట మునిగి చనిపోతే.. డెడ్ బాడీ 3-4 గంటల్లో గనుక దొరికితే ప్రాణాలు కాపాడొచ్చని పేర్కొంటూ.. ప్రశాంత్ త్రిపాఠి అనే వ్యక్తి పేరిట రెండు ఫోన్ నంబర్లు ఇచ్చారు. అందులో ఒక ఫోన్ నంబర్‌కు ‘సమయం’ ప్రతినిధి కాల్ చేయగా కనెక్ట్ కాలేదు. మరో ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ వచ్చింది.

‘‘ఒకటిన్నర క్వింటాల్ ఉప్పు మంచం వేసి రోగిని గుడ్డ వేసి పడుకోబెట్టండి. ఉప్పు శరీరం నుండి నీటిని సున్నితంగా గ్రహిస్తుంది. మనిషిలో స్పృహ నెమ్మదిగా వస్తుంది. ఆ వ్యక్తికి స్పృహ వచ్చినప్పుడు, అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లండి. ఇంతకు ముందు ఆసుపత్రికి తరలించి చనిపోయినట్లు ప్రకటించిన వ్యక్తిని ఉప్పు చికిత్సతో కాపాడారు. దేవుడు దయ ఉంటే చనిపోయిన వారు కూడా బతుకుతారు. ప్రయత్నించడంలో తప్పు లేదు. డాక్టర్లు చనిపోయినట్లు ప్రకటించిన తరువాత తొందరపడి సంస్కారం చేయవద్దు. వీలైనంత త్వరగా ఉప్పు చికిత్స చేయండి’’ అని ఆ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

వాస్తవానికి చనిపోయిన తర్వాత వ్యక్తిని ఉప్పు చికిత్సతో బతికించడం అసాధ్యం. దీని వెనుక ఎలాంటి శాస్త్రీయతా లేదు. గతంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలతో చనిపోయిన వ్యక్తులను ఉప్పులో ఉంచారు. కానీ ఎవరూ మళ్లీ బతకలేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఉప్పు తాకగానే శరీరం త్వరగా పాడవడం మొదలవుతుంది. జంతువుల శరీరం త్వరగా కుళ్లిపోవడానికి ఇంతకు ముందు ఉప్పు కలిపి గోతిలో పూడ్చేవారు. ఉప్పులో పూడ్చటం ద్వారా చనిపోయిన వ్యక్తి తిరిగి బతుకుతారనే ప్రచారం అబద్ధం అని వివరణ ఇస్తూ..

ఫ్యాక్ట్‌లీ

తోపాటు అనేక జాతీయ మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ కథనాలను వెలువరించాయి.

2022 సెప్టెంబర్లో‌లో కర్ణాటకలోని బళ్లారి తాలుకా సిరావర్ గ్రామంలో పదేళ్ల సురేశ్ సిరావర్ అనే పదేళ్ల బాలుడు నీటి కుంటలో పడి చనిపోయాడు. ఉప్పుతో మనిషిని బతికించొచ్చనే ప్రచారాన్ని నమ్మిన గ్రామస్థులు బాలుడి మృతదేహాన్ని

4 గంటలపాటు ఉప్పులో ఉంచారు

. ముఖాన్ని మాత్రమే బయటకు ఉంచారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. దీంతో బాధతో ఖననం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కథనాన్ని చూసి.. ప్రయత్నిస్తే పోయిందేం లేదు కదా అని తాము బాలుడి డెడ్ బాడీని ఉప్పులో ఉంచామని సమీప బంధువు విరూపాక్ష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *