ప్రముఖ జర్నలిస్టు డాక్టర్ ఎ.బి.కె. ప్రసాద్.. ప్రతిష్టాత్మక ‘రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు’కు ఎన్నికయ్యారు. జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే కార్యక్రమంలో ఏబీకేకు ఈ అవార్దు ప్రదానం చేస్తారు. ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం (ఫిబ్రవరి 8) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ ఈ అవార్డును ప్రకటించింది.
ఏబీకే పూర్తి పేరు అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్. పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఆయనకుంది. తెలుగులో వెలువడిన ప్రధాన పత్రికలన్నింటికీ సంపాదకులుగా పనిచేసిన ఘనత ఏబీకేకు ఉంది. 2004 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులుగానూ ఆయన సేవలు అందించారు.