రిషబ్ పంత్‌ని కొడతానని వార్నింగ్ ఇచ్చిన కపిల్‌దేవ్.. జట్టు కూర్పుని నాశనం చేశాడట!

భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ని కొడతానని దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ కోపంగా వార్నింగ్ ఇచ్చాడు. గత ఏడాది డిసెంబరు 30న ఢిల్లీ నుంచి సొంతూరుకి వెళ్తుండగా రిషబ్ పంత్‌కి యాక్సిడెంట్ అయ్యింది. అతను ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టి.. సంఘటన స్థలంలోనే కాలిపోయింది. రిషబ్ పంత్ ప్రాణాలతో బయటపడినా.. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ప్రస్తుతం ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ నెలలో రిషబ్ పంత్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉండగా.. ఇప్పట్లో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. దానికి కారణం అతని మోకాలు, కాలి మడమలకి తీవ్ర గాయాలవడమే. వైద్యులు ఈ రెండు గాయాలకి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈరోజు బెడ్‌పై నుంచి లేచిన రిషబ్ పంత్.. చక్రాల కుర్చీలో ఆసుపత్రిలోని బాల్కనీలోకి వచ్చి ఫ్రెష్ గాలిని పీలుస్తున్నట్లు ఒక ఫొటో కూడా షేర్ చేశాడు. పంత్ గాయాల తీవ్రత నేపథ్యంలో ఐపీఎల్ -2023, వన్డే ప్రపంచకప్ -2023కి కూడా పంత్‌కి దూరమవడం లాంఛనంగానే కనిపిస్తోంది.

రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. కానీ.. కపిల్‌దేవ్ మాత్రం పంత్‌ని చెంప దెబ్బ కొడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ‘‘నాకు రిషబ్ పంత్ అంటే చాలా ఇష్టం. అతను త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నా. అప్పుడే కదా నేను వెళ్లి అతని చెంపపై కొట్టి జాగ్రత్తలు చెప్పగలను. నీ యాక్సిడెంట్ కారణంగా జట్టు కూర్పు మొత్తం నాశనమైందని చెప్తాను. పంత్‌ అంటే నాకిష్టమే. కానీ అతనిపై ప్రస్తుతం నాకు కోపం ఉంది. ఈరోజుల్లో యువకులు ఎందుకు ఇలా చేస్తున్నారు? పంత్ ఆ తప్పు చేసినందుకు చెంప దెబ్బ కొట్టాల్సిందే’’ అని కపిల్‌దేవ్ కోపంగా చెప్పుకొచ్చాడు.

రిషబ్ పంత్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా టీమ్‌కి ఉపయోగపడేవాడు. ఇప్పుడు టెస్టు జట్టులో అతను లేకపోవడంతో వికెట్ కీపింగ్ కోసం ఒకరిని, అదనపు బ్యాటర్‌గా మరొకరిని తీసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. దాంతో జట్టు కూర్పు కూడా దెబ్బతింటుంది. అన్నింటికి మించి ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడంతో మిడిలార్డర్‌లో టీమ్‌ బ్యాలెన్స్ కోసం పంత్ బాగా ఉపయోగపడేవాడు. భారత్ జట్టు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (2021-23) ఫైనల్‌కి చేరాలంటే ఆస్ట్రేలియాని గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగు టెస్టుల సిరీస్‌లో తప్పక ఓడించాల్సి ఉంది. ఇంత కీలకమైన సిరీస్‌కి పంత్ దూరమవడంతో కపిల్‌దేవ్‌కి కోపం వచ్చినట్లు కనిపిస్తోంది.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *