పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి. రాష్ట్ర తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చగల ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ జాతీయ హోదా పొందిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ఆలస్యం అవుతోంది. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ ఇప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పండంటూ ఏపీ ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖ మంత్రిని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి గత టీడీపీ ప్రభుత్వ తీరే కారణమని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అధికార పార్టీ నేతలను నెటిజన్లు సందర్భం దొరికినప్పుడల్లా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా పర్యాటక మంత్రి రోజాను నెటిజన్లు ట్రోల్ చేశారు. ‘వైఎస్ఆర్ పోలవరం’ను రోజా ప్రారంభించారంటూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
తన సొంత నియోజకవర్గంలోని నిండ్ర మండలంలోని బీజీ కండ్రిక, ఎంసీ కండ్రిక గ్రామాల్లో.. రూ.11 లక్షలతో నిర్మించిన తాగునీటి బోరు, పైపులైన్లను మంత్రి రోజా ఇటీవల ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రోజా ప్రారంభించిన వాటర్ ట్యాక్ మీద ‘స్టార్ ప్రో’ అని రాసి ఉండగా.. దాన్ని ఎడిటింగ్ చేసిన కొందరు.. ఇంగ్లిష్‌లో ‘వైఎస్ఆర్ పోలవరం’ అని రాశారు. పోలవరం ప్రాజెక్టును రోజా ప్రారంభించారంటూ.. మార్ఫింగ్ చేసిన ఫొటోను వైరల్ చేస్తున్నారు. అన్నతో కలిసి పోలవరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా అంటూ సెటైర్లు వేస్తున్నారు. కొందరేమో ఆ మాత్రం చిన్న ట్యాంక్‌కు రూ.11 లక్షలు ఖర్చయ్యిందా అని ప్రశ్నిస్తున్నారు.
వచ్చే ఏడాది పోలవరం పూర్తి..!
పోలవరం ప్రాజెక్టు ప్రధాన ‘ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్’ కింది భాగంలో.. అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్‌ను కాఫర్ డ్యామ్‌లు నిర్మించకుండానే చంద్రబాబు సర్కారు నిర్మించిందని.. దీని వల్ల వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఇంజినీర్లు చెబుతున్నారు. ఇటీవలే డయాఫ్రమ్ వాల్‌కు టోమోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. వచ్చే రెండు మూడు నెలల్లో దాని ఫలితాలను విశ్లేషించాక డయాఫ్రమ్ వాల్ భవితవ్యం ఏంటనేది తేలనుంది. పోలవరం ప్రాజెక్ట్ కాఫర్ డ్యామ్ పనులు వేగంగా సాగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. 2024 మార్చిలోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్రం ఇటీవల ప్రకటించింది.