సచిన్ టెండూల్కర్ రికార్డ్‌కి 64 పరుగుల దూరంలో కోహ్లీ.. వరల్డ్ రికార్డ్‌ కూడా!

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli,) వరల్డ్‌ రికార్డ్‌కి 64 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు (IND vs AUS 1st Test) మ్యాచ్ గురువారం నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభంకానుంది. మొత్తం నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఓ 64 పరుగులు చేస్తే? అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25,000 పరుగుల మార్క్‌ని అందుకున్న ప్లేయర్‌గా వరల్డ్‌ రికార్డ్ నెలకొల్పనున్నాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి 2008లో ఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 490 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో ఇప్పటికే 24,936 పరుగులు చేసిన కోహ్లీ.. ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్‌లో సచిన్ టెండూల్కర్ (34,357), కుమార సంగక్కర (28,016), రిక్కీ పాంటింగ్ (27,483), జయవర్దనె (25957), జాక్వెస్ కలిస్ (25,534) టాప్-5లో కొనసాగుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఈ జాబితాలో టాప్-15లో ఉన్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీ తప్ప అందరూ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేశారు.

ఓవరాల్‌గా ఇన్నింగ్స్ పరంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ 546 ఇన్నింగ్స్‌ల్లో ఈ 24,936 పరుగులు చేశాడు. ఇందులో టెస్టుల్లో చేసిన పరుగులు 8119 కాగా.. వన్డేల్లో 12809, టీ20ల్లో 4008 రన్స్ చేశాడు. ఒకవేళ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కోహ్లీ 64 పరుగులు చేస్తే? 25 వేల పరుగుల మార్క్‌ని అందుకున్న రెండో భారతప్లేయర్‌‌గా కూడా నిలవనున్నాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఈ 25 వేల పరుగుల మార్క్‌ని అందుకునేందుకు 576 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. కానీ.. కోహ్లీ 546 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయికి చేరువుగా వచ్చేశాడు.

2019 నుంచి దాదాపు 1020 రోజుల పాటు ఫామ్ కోసం తంటాలు పడిన విరాట్ కోహ్లీ ఎట్టకేలకి గత ఏడాది ఆసియా కప్ -2022లో శతకంతో మళ్లీ టచ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుస శతకాలు బాదేస్తున్న ఈ స్టార్ ప్లేయర్ ఖాతాలో ఇప్పటికే 74 ఇంటర్నేషనల్ సెంచరీలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ 100 శతకాలతో ఈ సెంచరీల రికార్డ్‌లో టాప్‌లో ఉన్నాడు.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *