సామాన్యుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదృష్టదేవత అతడి ఇంటిలోకి ప్రవేశించిందా? అన్నట్టు వేల కోట్లు లాటరీ వరించింది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సుమారు రూ.6,250 కోట్లకుపైగా (754.6 మిలియన్ డాలర్లు) సొమ్మును సొంతం చేసుకున్నాడు. పవర్‌బాల్ లాటరీ గేమ్‌లో ఈ మొత్తం గెలుపొందాడు. అతడు కొనుగోలు చేసిన టిక్కెట్లలో ఒక దాని మొత్తం ఆరు నంబర్ల (05, 11, 22, 23, 69, 07)తో సరిపోలాయని, దీని మొత్తం విలువ 754.6 మిలియన్లు ఉంటుందని లాటరీ నిర్వాహకులు సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే, ఈ విజేత ఎవరనేది మాత్రం ఇంత వరకూ తెలియరాలేదు. అతడ్ని గుర్తించాల్సి ఉంది. ఈ జాక్‌పాట్ మొత్తాన్ని విజేతకు విడతలవారీగా అందజేయనున్నారు. తొలుత కొంతభాగం చెల్లించి.. మిగిలిన మొత్తాన్ని 29 సంవత్సరాల వరకు దశల వారీగా చెల్లిస్తారు. ఈ మొత్తానికి ఏడాదికి 5 శాతం చొప్పున వడ్డీని కలుపుతారు. ఒకవేళ, అందుకు అంగీకరించని పక్షంలో 754.6 మిలియన్ డాలర్లను కాస్తా 407.2 మిలియన్ డాలర్లకు తగ్గించి విజేత చేతికి ఒకేసారి అందజేస్తారు. అమెరికా లాటరీ చరిత్రలో ఇది తొమ్మిదో అతిపెద్ద లాటరీ అని నిర్వాహకులు తెలిపారు.
ఇదే లాటరీలో టెక్సాస్‌కు చెందిన వ్యక్తి 2 మిలియన్ డాలర్లు, మిచిగాన్, న్యూయార్క్‌లకు చెందిన మరో ఐదుగురు ఒక్కొక్కరు మిలియన్ డాలర్లు చొప్పున గెలిచినట్టు ప్రకటించారు. ప్రస్తుతానిది 34వ లాటరీ కాగా.. గత నవంబరు నుంచి ఇది పెరుగుతూ వస్తోందని పవర్‌బాల్ వెల్లడించింది. పవర్‌బాల్ లాటరీ టిక్కెట్ ధర రెండు డాలర్లు. గేమ్ ఆడేవాళ్లు తెలుపు బంతుల కోసం ఒకటి నుంచి 69 వరకు ఐదు సంఖ్యలను ఎంచుకుంటారు లేదా యాదృచ్ఛికంగా ఒకటి నుంచి 26 వరకు ఒక సంఖ్యను ఎంచ.
జాక్‌పాట్ గెలవాలంటే మొత్తం ఐదు తెలుపు బంతులు, ఎరుపు రంగు పవర్‌బాల్‌ల సంఖ్యతో సరిపోలాలి. గ్రాండ్ ప్రైజ్ కాకుండా సరిపోలే బాల్స్ ఆధారంగా నాన్-జాక్‌పాట్‌లోనూ పవర్‌బాల్ బహుమతిని గెలుచుకోవడానికి ఎనిమిది మార్గాలు ఉన్నాయి. నాన్-జాక్‌పాట్ బహుమతులు నాలుగు డాలర్లు నుంచి మిలియన్ వరకు ఉంటాయి. గతేడాది నవంబరు 7న అత్యధికంగా 2.04 బిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీ కాలిఫోర్నియా వ్యక్తి గెలుచుకున్నాడు. ఇప్పటి వరకూ పవర్‌బాల్ లాటరీలో ఇదే అత్యధిక ప్రైజ్ మనీ.
Read Latest International News And Telugu News