సుభానీ హోటల్ బిర్యానీ.. గుంటూరులో ఫేమస్.. ఆ స్పెషల్ టేస్ట్‌ వెనక సీక్రెట్ ఇదే!

బిర్యానీ రుచి నచ్చనిదెవరికి. ఈ కారణంగానే నాన్‌వెజ్ హోటల్స్… పల్లెల్లో కూడా వెలిశాయి. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి మిర్చి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చే రైతులు తెల్లవారుజామున గుంటూరు చేరుకొంటారు. వారికి రొటీన్ టిఫిన్ బదులుగా తక్కువ ధరలో నాన్‌వెజ్ అందిస్తే వ్యాపారం బాగా సాగుతుందనే లక్ష్యంతో గత నాలుగైదు దశాబ్దాల కిందట గుంటూరు పట్టణంలో పలు కిచిడి హోటల్స్ వెలిశాయి. అలా 1998లో మిర్చి యార్డుకి దగ్గరలో సుభానీ ప్రారంభించినదే హోటల్ సుభానీ.

ప్రారంభంలో ఉదయం 6 గంటలకి ఐటీసీ ఎదురుగా ఒక చిన్న బండి మీద కిచిడి, కబాబ్ అమ్మేవారు. అప్పటి ధర కేవలం పది రూపాయలు. రెండేళ్ల తర్వాత అక్కడే ఉన్న చిన్న షాప్ అద్దెకి తీసుకొని అందులోకి వ్యాపారాన్ని మార్చిన సుభానీ ఆ తర్వాత వెనక్కితిరిగి చూడలేదు. రుచి బావుండటం, ధర తక్కువలో దొరకడంతో రైతులు, యార్డ్ కూలీలతో పాటు.. గుంటూరు టౌన్ ప్రజలు, గుంటూరు వచ్చే ఇతర ప్రాంతాల వారు కూడా ఈ హోటల్‌కి భారీగా రావడం మొదలైంది.

కాలక్రమంలో కిచిడీ, కబాబ్‌తో పాటు కొన్ని రకాల నాన్‌వెజ్ ఐటమ్స్ కూడా అందించటం… కిచిడీ, బిర్యానీ వంటివి స్వచ్ఛమైన నేతితో చేయడం, రుచి నాణ్యత విషయంలో రాజీ పడకపోవడంతో సుభానీ హోటల్‌కి రాష్ట్రవ్యాప్తంగా పేరు వచ్చింది. తనతో పాటు దాదాపు 100 మందికి ఉపాధి కల్పించిన సుభానీ.. సత్తెనపల్లిలో బ్రాంచ్ ఓపెన్ చేసి బంధువులకు కూడా వ్యాపార అవకాశాలు కల్పించారు. గత నాలుగేళ్లలో బంధువులతో ఏర్పడ్డ వివాదాలతో వ్యాపారంలో కొన్ని చికాకులు అనుభవించినా… బంధువులు ఏర్పాటు చేసిన హోటల్స్ కూడా ఆయన ఇమేజ్ తోనే నడవడం విశేషం

గుంటూరులో అడుగుపెడితే సుభానీ బిర్యానీని రుచి చూడటం మరిచిపోవద్దు. హైదరాబాద్ ధమ్ బిర్యానీకి ఎంత ప్రత్యేకత ఉందో.. గుంటూరులో సుభానీ బిర్యానీకి కూడా అంత ప్రత్యేకత ఉంది. కేవలం బిర్యానీయే కాకుండా కిచిడీ, చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, పాయా, రోటి, కబాబ్‌ రుచులు అద్భుతంగా ఉంటాయని ఆహార ప్రియులు చెబుతుంటారు. ఈ బిర్యానీని కేవలం కట్టెల పొయ్యి మీదే వండుతారు. ఇందులో ఉపయోగించే మసాలాలు సైతం సొంతగా తయారుచేసినవే. కల్తీలేని బిర్యానీ తినాలంటే తప్పకుండా అక్కడికి వెళ్లాల్సిందే.

గుంటూరు సుభాని హోటల్లో గోంగూర పచ్చడితోపాటు, నత్త ముక్కల కూర కూడా ప్రత్యేకమే. ఈ కూర రుచి చూడాలంటే తీర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు. ఇక ఇక్కడ ఉలవచారు రుచి మరిచిపోలేరు. గుంటూరు సుభాని హోటళ్లలో ప్రత్యేకంగా కనిపించేవి.. ఇంగువచారు, ఉలవచారు. చాలా మంది ఇక్కడి ఉలవచారును బాగా ఇష్టపడతారు. హోటళ్ళు, రెస్టారెంట్లలోనే కాదు.. విందు భోజనాల్లో కూడా ఉలవచారు తప్పకుండా ఉండాల్సిందే.

గుంటూరులో ఎన్ని హోటల్స్ ఉన్నా బిర్యానీ పేరు చెప్పగానే సుభాని హోటల్ గుర్తుకు వస్తుంది. అక్కడ లభించే రుచి మరెక్కడా దొరకదు. అందుకే దూరమైనా కస్టమర్లు అక్కడికి వచ్చి పార్సిల్ తీసుకువెళుతుంటారు. కరోనా వైరస్ దేశంలో ప్రవేశించినప్పుడు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో సుభానితోపాటు, ఆయన సిబ్బంది ఉన్నారు. కొంతకాలం సుభానీ.. ఇంటి దగ్గరే ఉండిపోయారు. కనీసం వైద్యం కూడా చేయించుకోలేదు. 5 రోజుల అనారోగ్యం తరవాత సుభానీ కన్నుమూశారు. ఆయన కరోనాతో చనిపోయారని డాక్టర్లు తెలిపారు. తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సుభానీ.. పది కాలాల పాటు ప్రజల మనస్సులో నిలిచిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి అక్కర్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *