AP Capital గురించి కేంద్రం కీలక ప్రకటన.. వారికి గుడ్‌న్యూస్

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైందని కేంద్రం స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారమే ఏర్పాటైనట్లు పార్లమెంటు సాక్షిగా తేల్చి చెప్పింది. సెక్షన్ 5, 6 ప్రకారమే రాజధానిగా అమరావతి ఏర్పాటైందన్న కేంద్రం.. అమరావతే రాజధాని అని 2015 లో నిర్ణయించారని స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి (V. Vijayasai Reddy) ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అమరావతిని రాజధానిగా ఏపీ ప్రభుత్వం 2015 లోనే నోటిఫై చేసిందని స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందన్న కేంద్రం.. రాజధానిపై మాట్లాడడం సబ్ జ్యుడిస్ అవుతుందని సమాధానం ఇచ్చింది. 2020లో ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును తెచ్చిందని.. బిల్లు తెచ్చే ముందు ఏపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని కేంద్రం స్పష్టం చేసింది. రాజధానిపై హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా.. ఏపీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిందన్న కేంద్రం.. ప్రస్తుతం అమరావతి (Amaravati) అంశం కోర్టు పరిధిలో ఉందని వ్యాఖ్యానించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు కీలకం కానుంది. ఈ కేసుపై త్వరగా విచారణ జరపాలని కోరుతూ.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రారంభం కాగానే.. మరోసారి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ఇదే అంశాన్ని కోర్టు ముందు ఉంచారు. దీన్ని పరిశీలించిన అపెక్స్ కోర్టు.. ఈ నెల 23న దీనిపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

అటు హైకోర్టు (AP High Court) లో వచ్చిన తీర్పే మరోసారి సుప్రీం కోర్టులోనూ వస్తుందని.. ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్‌కు మాత్రమే రాజధాని మార్పు అధికారం ఉందని భావిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజధానుల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. ఈ నెల 23న విచారణ తర్వాత సుప్రీం కోర్టు ఏం చెప్పబోతుందని.. ఈ వివాదంపై తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో.. కేంద్రం ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *