వైసీపీలో కుదుపులు మొదలయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకత్వానికి సమాచారం అందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాలను ప్రొత్సహించడం ఎలా అనే దానిపై పార్టీ నాయకత్వం ఫోకస్ చేస్తోంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పార్టీని వీడిన.. పార్టీ కేడర్ దెబ్బతినకుండా చూడటం ఇప్పుడు వైసీపీకి(Ysrcp) అత్యంత కీలకంగా మారింది. ఇందుకోసం ఆ పార్టీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోందని తెలుస్తోంది. ఇక నుండి ద్వితీయస్థాయి నాయకులతో నేరుగా సంబంధాలు ఏర్పర్చుకోవాలని యోచిస్తోంది. ఇప్పటివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉంటారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో సెకండ్ కేడర్ నాయకులంతా మంత్రులు, ఎమ్మెల్యేలకు అనుచరులుగా ఉండిపోతుంటారు.
వారికి ఏదైనా రాజకీయంగా ఇబ్బంది వస్తే స్థానికంగా ఉన్న శాసనభ్యులపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటి ఇబ్బందులను వైసీపీలోని ద్వితీయ స్థాయి నేతలు ఎదుర్కోకూడదన్ను ఆలోచనతో సీఎం జగన్(YS Jagan) ఉన్నట్టు తెలుస్తోంది. సెకండ్ కేడర్ నాయకులందరినే వేర్వేరు సందర్భాల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా జిల్లా పర్యటనకు వెళ్లే సందర్భంలో స్థానిక శాసనసభ్యులతోపాటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన ద్వితీయ స్థాయి నాయకులకు కూడా ఆ సమావేశంలో పాల్గొనేలా చూడాలని వైసీపీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
నెల్లూరు ఘటనతో సెకండ్ కేడర్‌కు(Second Cadre) ప్రాధాన్యత పెరిగినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేల వెంట వెళ్లకుండా చూడాలని పార్టీ నాయకత్వం ఆయా జిల్లా నేతలకు సూచించింది. ఇందుకోసం వారితో చర్చలు జరపాలని.. అవసరమైతే వారిని పార్టీ అధినాయకత్వం దగ్గరకు కూడా తీసుకురావాలని కోరినట్టు సమాచారం.
Pawan Kalyan: సీఎం జగన్ కు సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బిరుదు..వైరల్ గా మారిన ఆ కార్టూన్!
YS Jagan: జనంలోకి జగన్.. ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యక్రమం..
ద్వితీయ శ్రేణి నాయకత్వం పటిష్టంగా ఉంటే.. అక్కడ పార్టీ తరపున ఎవరిని బరిలోకి దింపినా.. గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది వైసీపీ నాయకత్వం యోచనగా కనిపిస్తోంది. అందుకే సీఎం జగన్ కూడా జిల్లాల పర్యటనల్లో ఇకపై ద్వితీయ శ్రేణి నాయకులతోనూ సమావేశమవుతారని తెలుస్తోంది. వారికి ఎలాంటి అవసరం వచ్చినా.. తాము ఉన్నామనే భరోసా కల్పించే విధంగా నాయకత్వం చర్యలు తీసుకుంటుందని.. ఆ దిశగా సీఎం జగన్ వారికి భరోసా ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.