Haj Yatra కేరళ యువకుడి సాహసం.. కాలినడకన సౌదీకి.. ఆటంకాలు అధిగమించి పాక్‌లోకి ఎంట్రీ

కాలినడకన హజ్ యాత్రకు బయలుదేరిన భారతీయుడు మంగళవారం పాకిస్థాన్‌‌లోకి ప్రవేశించాడు. గతేడాది జులైలో కేరళకు చెందిన యువకుడు షిహాబ్ బాయ్ (29) కాలినడకన హజ్ యాత్రకు బయలుదేరాడు. దీనికోసం అతడు 8,640 కిలోమీటర్ల మేర నడవాల్సి ఉంటుంది. భారత్, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, కువైట్ మీదుగా సౌదీ అరేబియాలోని మక్కాకు చేరుకుని.. కాబా గృహంలో ప్రార్థనలు చేయాలనేది షాహిబ్ కోరిక. అయితే, షిహాబ్‌ ప్రయాణానికి పాకిస్థాన్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన తరఫున లాహోర్‌కు చెందిన సర్వర్ తాజ్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా.. భద్రతా కారణాలతో అనుమతించలేమని తేల్చిచెప్పింది.

భారతీయ సిక్కులకు పాక్ ప్రభుత్వం వీసాలు మంజూరు చేసినట్టుగానే షిహాబ్‌ను కూడా అనుమతించాలని కోరాడు. కానీ, ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని లాహోర్ హైకోర్టు పేర్కొంది. దీంతో సర్వర్ తాజ్ ఆ దేశ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పాకిస్థాన్ మీదుగా షాహిబ్‌ ప్రయాణానికి అనుమతించేలా ట్రాన్సిట్ వీసాను మంజూరు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

దీంతో మంగళవారం వాఘా సరిహద్దు ద్వారా షిహాబ్ పాక్‌లోకి ప్రవేశించగా.. సర్వర్ తాజ్, పాకిస్థాన్ భగత్‌సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీలు స్వాగతం పలికారు. మక్కా యాత్ర కొనసాగించడానికి వీసా లభించడంతో షాహిబ్ చాలా సంతోషించాడని ఖురేషీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రేమ, స్నేహం, సౌభ్రాతృత్వ సందేశాన్ని అతడు తీసుకొచ్చాడు’’ అని ఖురేషీ అన్నారు. లాహోర్ హైకోర్టు ఆవరణలో షిహాబ్ గౌరవార్థం ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించాను, అయితే భద్రతా సమస్యల కారణంగా కుదరలేదన్నారు.

‘‘తాను కాలినడకన హజ్ యాత్రకు వెళ్తున్నానని, ఇప్పటికే 3 వేల కిలోమీటర్లు ప్రయాణించాను.. మానవతా దృక్పథంతో పాకిస్థాన్‌లో ప్రవేశించేందుకు అనుమతించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను షిహాబ్ అభ్యర్థించారు.. ఇరాన్ మీదుగా సౌదీ అరేబియా చేరుకోవడానికి ట్రాన్సిట్ వీసా కావాలి అని కోరాడు’’ అని ఫెడరల్ ఏజెన్సీ అధికార వర్గాలు తెలిపాయి.

తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనేది ప్రతి ముస్లిం కల. హజ్ అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కాకు తీర్థయాత్ర చేయడం. ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన మక్కా మసీదు అక్కడ ఉంది. మహ్మద్ ప్రవక్త కాలం నాటి ఈ పుణ్యక్షేత్రానికి సాగించే యాత్రనే హజ్ యాత్రగా పేర్కొంటారు.

ఇక, మలప్పురం జిల్లా కొట్టక్కల్ సమీపంలోని అతవనాడ్‌కు చెందిన షిహాబ్ కేరళ నుంచి మక్కా వరకు కాలినడకన ప్రయాణించే వ్యక్తుల కథలను వింటూ పెరిగాడు. దాంతో చిన్నప్పుడే అతడు తాను కూడా మక్కాకు వెళ్తే నడిచే వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అదే అతని జీవిత కలగా మారింది. తనతో పాటు తన కలను పెంచుకున్నాడు.

Read Latest National News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *