cherlapally : మృత్యువు ఏ రూపంలో కబళిస్తుందో ఉహించటం కష్టం. అప్పటి వరకు సరదగా గడిపిన వారు కూడా ఉన్నట్లుండి కూప్పకూలుతున్న ఘటనలు ఇటీవల కాలంలో మనం చాలానే చూస్తున్నాం. కారణాలు ఏవైనా ఆకాల మృత్యువులతో అనేక కుటుంబాల్లో విషాదం అలుముకుంటుంది. ఇలాంటి ఘటనే హైదరాబాద్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి సిలిండర్ నాజిల్ రూపంలో మృత్యువు ఎదురైంది.
వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ఉయ్యూరుకు చెందిన ప్రకాశ్(48) 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. చర్లపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటూ అక్కడే సౌత్‌వైర్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చర్లపల్లి పారిశ్రామికవాడ బీఎన్‌రెడ్డినగర్‌లో సూర్య ఇంజినీరింగ్ పరిశ్రమకు మంగళవారం సాయంత్రం ఆక్సిజన్ సిలిండర్లలో లోడుతో ఆటో వచ్చింది. కూలీలు ఆటోలోని సిలండర్లను కిందకు దింపుతుండగా.. ఓ సిలిండరు కిందపడింది. ఈ క్రమంలో దానికున్న నాజిల్ ఊడి ప్రెషర్‌తో గాల్లోకి దూసుకెళ్లింది. అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్లే ప్రకాశ్ తలకు నాజిల్ తగలటంతో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయాడు. అనంతరం క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య జ్యోతి, కవల పిల్లలు కార్తీక్, కీర్తన్ ఉన్నారు. ప్రకాశ్ అకాల మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీఎస్సీ, బీఫార్మసీ చదువుతున్న ఇద్దరు కుమారులు రోదించిన తీరు పలువురిచే కంటతడి పెట్టించింది.
Read More Telangana News And Telugu News