తిరుపతి జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు రైతులను అప్రమత్తం చేశారు. జాగ్రత్తగా ఉండాలని రైతులకు సూచించారు. జిల్లాలోని చంద్రగిరి మండలం ఏ రంగంపేట అటవీ సమీప ప్రాంతాల్లో చిరుత పులి సంచారంతో రైతులు, పశు కాపర్లు భయాందోళనలో ఉన్నారు. శేషాచల అటవీ ప్రాంతాల్లోని రాగిమాకుల గుంట పెద్దపల్లి తోపు ప్రాంతాలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది.
డి.చంద్రబాబు అనే రైతు పశువులు, మేకల మందతో అటవీ సమీప ప్రాంతాల్లో తన పొలం వద్ద ఉంచుకొని జీవనం సాగిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో చిరుతపులి మేకపిల్లను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిచడంతో రైతు అప్రమత్తమై కేకలు వేయడంతో మేకపిల్లను వదలి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయింది.
అయితే మేకపిల్ల మెడ భాగంలో చిరుత గాయపరచడంతో అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాణ సంచాలు కాలుస్తూ రైతులను అప్రమత్తం చేశారు. అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ.. చిరుత పులి సంచారిస్తోందని సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను అప్రమత్తం చేశామని తెలిపారు. చిరుత కనిపిస్తే తమకు సమాచారమివ్వాలన్నారు.
అంతేకాకుండా జనాలు ఎవరూ కొద్దిరోజుల పాటు అడవులలో మేతకు మూగజీవాలను తీసుకెళ్లరాదని హెచ్చరించారు. అటవీ సమీప ప్రాంతాల్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. పై అధికారులకు సమాచారం అందించిన అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాల్లో చిరుత కోసం గస్తీ ముమ్మరం చేస్తున్నామని తెలిపారు.