రాకాసి భూకంపం టర్కీ, సిరియాలను అతలాకుతలం చేసింది. ప్రకృతి విలయానికి ఇరు దేశాలూ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. ఎటుచూసినా భవన శిథిలాలు.. శవాలు గుట్టలు.. నిరంతరం భయపెడుతూ భూప్రకంపనలు. సున్నా కంటే దిగువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. సమాచార వ్యవస్థ సహా ఏదీ అందుబాటులో లేని దుస్థితి. శిథిలాలను తొలగిస్తున్నకొద్దీ వెలుగుచూస్తున్న మృతదేహాలు. ఇది టర్కీ, సిరియాలో పెను భూకంపం అనంతరం నెలకొన్న హృదయవిదారక పరిస్థితి. సోమవారంనాటి భూకంపంలో మృతిచెందినవారి సంఖ్య 7,800 దాటింది. 20 వేల మందికి పైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది.
ఈ కష్టకాలంలో రెండు దేశాలను ఆదుకోడానికి ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. నేలమట్టమైన వేలాది భవంతుల్లో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకోడానికి సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఒక్క టర్కీలోనే 6,000 భవనాలు కూలిపోయాయి. సహాయక చర్యల్లో 25,000 మందికిపైగా పాల్గొన్నా.. ఏమూలకూ సరిపోవడం లేదు.
మరోవైపు, వరుస భూప్రకంపనలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. భూకంపం తర్వాత 300లకుపైగా ప్రకంపనలు సంభవించాయి. ఇవి సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలహీనంగా ఉన్న భవనాలు కూలిపోయే ప్రమాదం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
ఈ విపత్తు నుంచి బయటపడినవారు శిథిలాల కింద చిక్కుకున్న తమవారి కోసం రోదిస్తున్న తీరు అందర్నీ కలిచివేస్తోంది. వారి ఆర్తనాదాలు, హాహాకారాలతో అక్కడ పరిస్థితులు గుండెలు పిండేస్తున్నాయి. హతయ్ ప్రావిన్సులో కుప్పకూలిన ఓ బహుళ అంతస్తుల భవన శిథిలాల నుంచి ఏడేళ్ల చిన్నారిని రెస్క్యూ సిబ్బంది రక్షించి బయటకు తీశారు. ఆ వెంటనే ఆ బాలిక తన తల్లి గురించి పడుతోన్న ఆరాటం అక్కడివారిని కదిలించింది.
భూకంప బాధితుల కోసం సైన్యం తాత్కాలిక శిబిరాలను, క్షేత్రస్థాయి ఆసుపత్రులను ఏర్పాటు చేస్తోంది. షాపింగ్ మాల్స్, స్టేడియాలు, మసీదులు, సామాజిక భవనాల్లో ప్రజలు తలదాచుకుంటున్నారు. ఇస్కెర్‌డెరున్‌లో ఆసుపత్రి కూలిపోవడంతో భూకంప బాధితులకు వైద్యం కోసం నౌకాదళ నౌకను సమీపంలోని రేవుకు పంపించారు.
‘‘నా సోదరుడ్ని శిథిలాల నుంచి తిరిగి తీసుకురాలేను. నేను నా మేనల్లుడిని తిరిగి తీసుకురాలేను.. రెండు రోజులుగా చలికి పిల్లలు వణికిపోయి గడ్డుకట్టుకుపోతున్నారు’’ అని కహ్రామన్మరాస్ నగరంలో అలీ సాగిరోగ్లు అనే బాధితుడు కన్నీటిపర్యంతమయ్యారు. భూకంపానికి తోడు శీతాకాలం మంచు తుఫాను సహాయక చర్యలకు అవరోధంగా మారింది. రహదారులపై మంచు పేరుకుపోవడం, చలిగాలులకు అక్కడవారి పరిస్థఇతి అగమ్యగోచరంగా మారింది. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడతాయి.
భూకంపం కారణంగా మొత్తం 23 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారని, వారికి ఆపన్నహస్తాన్ని అందజేయడానికి అన్ని దేశాలూ ముందుకు రావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభ్యర్థించింది. ఇటువంటి కష్టకాలంలో సిరియాపై ఉన్న ఆంక్షలను పశ్చిమ దేశాలు తొలగించి, మానవత్వంతో ముందుకురావాలని సిరియా రెడ్ క్రిసెంట్ కోరింది.
Read Latest International News And Telugu News