అటు కేంద్రం.. ఇటు రాష్ట్రం.. మధ్యలో అమరావతి!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు రాజధాని చుట్టూ తిరుగుతోంది. సుప్రీం కోర్టులో త్వరలో మూడు రాజధానులపై విచారణ జరగనున్న నేపథ్యంలో.. మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రతిపక్ష చంద్రబాబు మొదలు.. ఇతర పార్టీల నేతలు కూడా ప్రభుత్వంపై ఒంటి కాలితో లేస్తున్నారు. అయితే.. రాజధాని విషయంలో ప్రజల్లో ఇంత గందరగోళం రావడానికి కారణం బీజేపీనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో హైకోర్టులో ఒకలాగా.. తాజాగా సుప్రీం కోర్టులో ఒకలాగా అఫిడవిట్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై లెఫ్ట్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

‘ప్రధాని మోదీ అమరావతిలో శంకుస్థాపన చేసిన రోజే రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాలకు రాజధానిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ.. అది ఒకసారే ఉంటుంది. ప్రతీసారి మారుస్తాం అంటే కుదరదు. సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ రాజధానిగా ఉంది. సెక్షన్ 6 ప్రకారం ఏపీకి రాజధానిని నిర్ణయించారు. అప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించి ఏపీ ప్రభుత్వం పంపింది. అందుకే కేంద్రం నిధులు కూడా ఇచ్చింది. ఇప్పుడు పేరుకే మూడు రాజధానులు అని చెబుతున్నారు. కానీ.. ఈ విషయంలో కేంద్రాన్ని సంప్రదించలేదు. కేంద్రాన్ని ఎందుకు సంప్రదించలేదు’ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం ప్రశ్నించారు.

‘గతంలో కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌కు.. తాజాగా ఇచ్చిన అఫిడవిట్‌కు తేడా ఉంది. ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉంది. స్వయంగా అమిత్ షా బీజేపీ నేతలను మందలించారు. అమరావతిలో రైతులు ఆందోళన చేస్తుంటే.. ఏం చేస్తున్నారని అమిత్ షా మందలించారు. ఈ విషయంలో వైఎస్సార్సీపీ ఆందోళనకు గురి చేస్తుంటే.. దానికి బీజేపీ వంత పాడింది. ఇంత జరుగుతున్నా.. ప్రధాని మోదీ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు. రెండో అఫిడవిట్‌లోనూ పూర్తి స్పష్టత కనిపించడం లేదు. బీజేపీ ఇప్పటికీ తూకం వేసి చూస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా అమరావతి వైపు నిలబడాలి’ అని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత గఫూర్ వ్యాఖ్యానించారు.

‘అసలు రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదు. కావాలని మధ్యలో వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. ఎవరెన్ని అనుకున్నా.. మా విధానం మూడు రాజధానులు. చంద్రబాబు మాటలనే కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. అసలు బీజేపీ నేతలకు ఉన్న రైట్స్ ఏంటీ. జగన్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. రాజధాని విషయంలో శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది. అమరావతి ప్రాంతంలో 20 అడుగుల నీరు వస్తుందని చెప్పారు. అయినా.. అదే ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఎందుకు రాజధానిని నిర్ణయించారు. అమరావతికి డబ్బులు ఇచ్చామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు. అమరావతిని రాజధానిగా కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు’ అని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *