అదానీ విల్మర్ గ్రూపు.. మీరు వాడే వంటనూనెలో మూడో వంతు అదానీ కంపెనీలదే

దేశమంతా అదానీ గురించి చర్చ జరుగుతున్న వేళ, అదానీ కంపెనీ అంటే బొగ్గు, ఎయిర్పోర్టులు, కరెంటు, ఓడరేవులు అనే చాలా మంది అనుకుంటున్నారు. కానీ కిరాణా వ్యాపారంలో కూడా అదానీయే టాప్ ఇప్పుడు.

కిరాణా ఏంటని కన్ఫ్యూజ్ కావద్దు. ఇంట్లో వాడే సాధారణ సరుకుల ఉత్పత్తి, పంపిణీలో ఇప్పుడు దేశంలో నంబర్ వన్ కంపెనీ అదానీదే. వీటినే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అంటారు.

మీరు వాడే వంటనూనెలో మూడో వంతు అదానీదే! మీరు మార్కెట్లో కొనే నూనె ప్యాకెట్లు, నూనె డబ్బాల్లో ప్రతీ నాలుగింటిలో ఒకటి అదానీ గ్రూపుదే. అంతేకాదు, ఈ వ్యాపారంలో భారతీయులకు సుదీర్ఘ కాలంగా పరిచయం ఉన్న హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్‌ను కూడా ఎప్పుడో దాటేసింది అదానీ విల్మర్ గ్రూపు.

2021-22 సంవత్సరానికి గానూ హిందూస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ వాళ్లు రూ. 51, 468 కోట్ల వ్యాపారం చేస్తే, అదానీ విల్మర్ గ్రూపు రూ. 54, 214 కోట్ల వ్యాపారం చేసింది.

2013లో మొదలై 2023 వచ్చేసరికి దేశంలోనే నంబర్ వన్ ఫుడ్, ఎఫ్ఎంసీజీ బ్రాండ్ అయింది అదానీ విల్మర్ గ్రూపు.

90 ఏళ్ల నుంచి పాతకుపోయిన యూనిలీవర్‌ను దాటి ఈ రంగంలో మార్కెట్ నంబర్ వన్‌గా అదానీ గ్రూపు అవతరించడానికి ఉపయోగపడింది వంటనూనెలే!

సింగపూర్‌కి చెందిన విల్మర్ సంస్థకు ఈ రీటెయిల్ వ్యాపారంలో బాగా పట్టు ఉంది. భారతదేశంలోని వ్యవహారాలపై అదానీకి పట్టుంది. ఇద్దరూ కలసి దేశంలోనే అది పెద్ద ఫుడ్ సంస్థను స్థాపించారు. ఈ కంపెనీకి ఎన్ని వ్యాపారాలున్నా, నూనెదే అందులో సింహ భాగం. విల్మర్ అంతర్జాతీయంగా ఫుడ్, ఎఫ్ఎంసీజీలో తన అనుభవం ఉపయోగిస్తే, అదానీ లోకల్ మార్కెట్, లాజిస్టిక్స్, రెగ్యులేటింగ్ చూస్తోంది.

భారతదేశంలో వివిధ అంశాలు, వ్యవస్థలపై అదానీ గ్రూపుకు ఉన్న పట్టు, ఈ కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టింది.

“భారతదేశంలో బ్రాండెడ్ ఆయిల్ మార్కెట్ విలువ దాదాపు 1 లక్షా 56 వేల కోట్లు. ఇందులో అదానీ విల్మర్, రుచి సోయా, ఇమామీ, మారికో వంటి కంపెనీలు పెద్దవి. ఇప్పుడు అదానీ అందులో దూసుకుపోతున్న సంస్థ. రిఫైన్డ్ సోయా బీన్ ఆయిల్‌లో అదానీ విల్మర్ అతి పెద్దది. 28 శాతం మార్కెట్ వాళ్లదే. పామాయిల్‌లో రెండో స్థానం వీరిది. మార్కెట్ వాటా 11 శాతం. ఇక మస్టర్డ్ ఆయిల్‌లో 10 శాతం, సన్ ఫ్లవర్‌లో 14 శాత, రైస్ బ్రాన్‌లో 20 శాతం అదానీ విల్మర్ వాటా ఉంది” అని వాణిజ్య రంగ నిపుణులు నాగేంద్ర సాయి బీబీసీతో చెప్పారు.

 • ‘అదానీ ఒక్కరే ఇన్ని వ్యాపారాలు చేస్తారా?’ – పార్లమెంటులో మోదీని ప్రశ్నించిన రాహుల్ గాంధీ, తోసిపుచ్చిన బీజేపీ
 • గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని షేక్ చేసిన హిండెన్-బర్గ్ కథ ఏంటి… దాని వెనుక ఉన్న అండర్సన్ ఎవరు- – BBC News తెలుగు

సన్ ఫ్లవర్, సోయా, వరి, వేరుసెనగ, ఆవాలు, పామాయిల్, పత్తి ఇలా రకరకాల నూనెలు, వనస్పతులు ఉత్పత్తి చేస్తోంది అదానీ సంస్థ. ఈ సంస్థకు రోజుకు 12 వేల టన్నుల నూనె శుద్ధి చేసే కెపాసిటీ ఉంది. 23 ఫాక్టరీలు ఉన్నాయి. ఏటా 25 లక్షల టన్నుల నూనె శుద్ది చేస్తోంది ఈ సంస్థ.

“ఇన్ని రకాల భిన్నమైన నూనెలు ఉత్పత్తి చేస్తోన్న మరో భారతీయ సంస్థ లేదు” అన్నారు నాగేంద్ర సాయి.

“మేం కొబ్బరి నూనె తప్ప, అన్ని రకాల నూనెల ఉత్పత్తిలోనూ ఉన్నాం” అని మీడియాతో చెప్పారు అదానీ విల్మర్ సీఈవో మల్లిక్.

మార్కెట్లో విరివిగా దొరికే ఫార్చూన్ బ్రాండ్ వంట నూనె అదానీదే. అదే కాకుండా, అదానీ దగ్గర కింగ్స్, ఆధార్, బుల్లెట్, రాగ్, అల్ఫ్, జుబిలీ, అవసర్, గోల్డెన్ చెఫ్, ఫ్రయోలా పేర్లతో అనేక నూనె బ్రాండ్లు ఉన్నాయి.

కేవలం ఇంటి అవసరాలకే కాకుండా హోటెల్స్, బేకరీలకు అదానీ గ్రూపు వంట నూనెలు పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయి. ఎగుమతులు కూడా చేస్తున్నారు. అమెరికా, కెనడా, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

రీటైల్‌తో సమానంగా, హోటెళ్లు, రెస్టారెంట్లు, కేటరర్ల పరంగా అదానీ వ్యాపారం పెరుగుతోంది. 2022 అక్టోబరు, నవంబరు, డిసెంబరు – కేవలం ఈ మూడు నెలలకు నూనె, ఇతర ఎఫ్ఎంసీజీ వస్తవుల వల్ల అదానీ నికర లాభం రూ. 246 కోట్లు.

 • అదానీ-హిండెన్-బర్గ్ వివాదం- షార్ట్ సెల్లింగ్-లో కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు… లాభాలు ఎలా వస్తాయ్ – BBC News తెలుగు
 • గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్-బర్గ్ ఎఫెక్ట్… 10 రోజుల్లో 8 లక్షల కోట్లు మాయం – BBC News తెలుగు

కలిసొచ్చిన రష్యా-యుక్రెయిన్ యుద్ధం

భారతదేశంలో ఇప్పటికీ సగానికి పైగా వంట నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. 2021-2022లో భారతీయులు రెండు కోట్ల 67 లక్షల టన్నుల ఆయిల్ వాడారని కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో ఒక కోటి 40 లక్షల టన్నుల నూనెలను దిగుమతి చేసుకున్నారు. 80 లక్షల టన్నులు పామాయిల్, 38 లక్షల సోయా ఆయిల్, 20 లక్షల టన్నుల సన్ ప్లవర్ దిగుమతి చేసుకున్నారు.

అందులో సన్ ఫ్లవర్ నూనె 90 శాతం రష్యా నుంచే వస్తోంది. భారతదేశం దిగుమతి చేసుకునే సన్ ఫ్లవర్ నూనెలో 70 శాతం యుక్రెయిన్ నుంచి, మిగిలిన 20 శాతం రష్యా నుంచి వస్తోంది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం దిగుమతలకు పెద్ద ఆటంకం కలిగించింది.

 • 2022లో రష్యా-యుక్రెయిన్ యుద్ధం
 • 2021లో మలేసియా వాతావరణ పరిస్థితులు, ఇండోనేషియా ఎగుమతుల నిషేధం
 • 2021-22 కెనడా వాతావరణ పరిస్థితులు

ఇవన్నీ అంతర్జాతీయంగా నూనె ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. అవే భారతీయ నూనె కంపెనీలకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాయి. మార్కెట్లో వంటనూనె ధరలతో పాటూ షేర్ మార్కెట్లో నూనె కంపెనీల ధరలు బాగా పెరిగిపోయాయి.

అలా రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైందో లేదో, ఇలా అదానీ విల్మర్ సంస్థ షేర్లు పెరగడం ప్రాంరభం అయింది. రెండు నెలల కాలంలో ఆ సంస్థ షేర్ ధర మూడు రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 2022 ఫిబ్రవరిలో రూ. 221 నుంచి ఏప్రిల్ చివర్లో రూ. 764 వెళ్లింది .

ఇక అక్కడి నుంచి వెనక్కి చూసుకులేదు. దేశంలోనే అతి పెద్ద రీటెయిల్ ఆయిల్ బ్రాండ్‌‌గా ఎదిగింది అదానీ విల్మర్ గ్రూపు.

“గతేడాది మార్చి నెలలో రష్యా-యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు సన్ ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ ధరలు విపరతంగా పెరిగాయి. భారతీయ దిగుమతులపై కూడా ప్రభావం పడింది. అధిక ధర పెట్టి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను భారతదేశం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఇదే అదనుగా ఈ వ్యాపారంలో ఉన్న అదానీ స్టాక్ ఏకంగా 40 శాతం పెరిగింది. మార్చి నెలలో స్టాక్ వరుసగా తొమ్మిది రోజుల పాటు 5 శాతం అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది” అని నాగేంద్ర సాయి వివరించారు.

అయితే రష్యా-యుక్రెయిన్ యుద్ధానికంటే ముందు నుంచీ, దాదాపు నాలుగేళ్లుగా వంటనూనెల ధరలు బాగా పెరిగాయి. ఆ పెరుగుదల కూడా అదానీ గ్రూపుకు బాగా ఉపయోగపడింది.

 • గౌతమ్ అదానీ ఇజ్రాయెల్-లోని హాయిఫా పోర్టు కోసం ఎందుకంత భారీగా ఖర్చు చేశారు- – BBC News తెలుగు
 • అదానీ గ్రూప్- ఆ నివేదిక అంతా అబద్ధం; ‘అయితే, కోర్టులో తేల్చుకుందాం’ అని సవాలు విసిరిన హిండెన్-బర్గ్ – BBC News తెలుగు

ఫుడ్ మార్కెటే తదుపరి టార్గెట్

నూనెల్లో టాప్‌లో ఉన్న అదానీ గ్రూపు ఇప్పుడు పప్పులు, బియ్యం, గోధుమలు, పంచదార, శనగపిండి, రవ్వలపై ఫోకస్ పెట్టబోతోంది. ఆ రంగంలో పెద్ద ప్లానే వేసింది.

ఓడరేవులు, రవాణా, వ్యవసాయాధారిత పరిశ్రమలు, కరెంటు, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సేవలు, రక్షణ రంగంతో సమానంగా ఫుడ్ రంగంపై దృష్టి పెట్టింది.

బ్రాండెడ్ బియ్యం అంటే చాలా మంది కేవలం బాస్మతియే అంటారు. నాన్ బాస్మతి బియ్యంలో పెద్దగా జాతీయ స్థాయి ఫేమస్ బ్రాండ్ బియ్యం అంటూ లేవు. కానీ ఆ నాన్ బాస్మతిలో బ్రాండెడ్ బియ్యం అమ్మడం మొదలుపెట్టింది అదానీ గ్రూపు.

రీజినల్ బ్రాండ్ బియ్యం అమ్మే మొదటి జాతీయ ఫుడ్ బ్రాండ్‌గా అవతరించింది.

 • ఆక్స్-ఫామ్ నివేదిక- ఒకశాతం వ్యక్తుల చేతుల్లో 40శాతం భారత్- సంపద – BBC News తెలుగు
 • అదానీ గ్రూప్- హిమాచల్ ప్రదేశ్-లో సిమెంట్ ప్లాంట్ల మూత.. రోడ్డున పడ్డ వేలాది జనం – BBC News తెలుగు

ఇప్పటికే బెంగాల్‌లో ఫార్చ్యూన్ బ్రాండ్ రైస్ విడుదల చేసింది అదానీ గ్రూపు. సాధారణంగా బియ్యం, గోధుమలు వంటివి దేశమంతా ఒకే వెరైటీ తినరు. ప్రాంతాన్ని బట్టి ఆసక్తి మారిపోతుంది. కానీ పెద్ద బ్రాండ్లు దేశమంతా ఒకే వెరైటీ అమ్ముతాయి. సరిగ్గా ఈ పాయింట్ పట్టుకుంది అదానీ గ్రూపు. ఏ రాష్ట్రం, ఏ ప్రాంతంలో ఏ వెరైటీ ఎక్కువ తింటారో, ఆ వెరైటీ అమ్మేలా ప్లాన్ చేస్తోంది. బెంగాల్ నుంచే ఈ ప్రయోగం మొదలైంది. అందుకోసం ఇప్పటికే బెంగాల్‌లో రైస్ మిల్లుల కొనుగోలు మొదలుపెట్టింది.

“ప్రస్తుతం బ్రాండెడ్ చపాతి పిండి మార్కెట్లో అదానీ విల్మర్‌కు 3.4 శాతం వాటా ఉంది. బియ్యం మార్కెట్లో అదానీ వాటా 8 శాతం” అన్నారు నాగేంద్ర సాయి.

“నూనెల నుంచి మొదలై ఫుడ్‌లోకి వచ్చారు. అంత పెద్ద వైవిధ్య వ్యాపారాలు ఉన్న సంస్థలు తాము వ్యాపారం చేస్తోన్న అన్ని రంగాల్లోనూ నంబర్ వన్‌గా ఉండటం చాలా అరుదైన విషయం. అదంత సులువు కాదు” అని సీఐఐ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఛైర్మన్ వినాయక ఛటర్జీ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

ఇవి కూడా చదవండి:

 • తెలంగాణ: ‘కేజీ టు పీజీ’ ఉచిత విద్య అమలు ఎంత వరకు వచ్చింది?
 • భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
 • అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా… ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
 • ద‌ళిత విద్యార్థులు పైలెట్ కావాలనుకుంటే రూ.3.72 ల‌క్ష‌ల స్కాల‌ర్ షిప్, నెలకు రూ.22 వేలు ఉపకారవేతనం ఇచ్చే ప్రభుత్వ పథకం
 • చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్‌మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *