Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam
పాపం ఆ ఎమ్మెల్యే. ఎంత కష్టపడినా ప్రయోజనం మాత్రం శూన్యమట. అధిష్టానం ఎదుట మంచి మార్కులు ఉన్నా… టిక్కెట్ మాత్రం రాదంటోంది వైసిపి శ్రేణి. ఇప్పటికే ఆయన కష్టం బూడిదలో పోసిన పన్నీరయిందని అంటున్నారు. ఓ సామాజిక వర్గం తన కష్టాన్ని మింగేస్తోందని టాక్. సాక్షాత్తూ సీఎం జగన్ (AP CM YS Jagan) ని ఆశ్రయించినా.. ఆయనకు భరోసా మాత్రం రాలేదనేది నిజమేనా..? అసలు పెందుర్తిలో అదీప్ రాజుకు ఎందుకు చప్పబడిపోయారు..? ఇప్పటికే ఎన్నో చేసిన ఎమ్మెల్యేకి ఈ అవస్థ ఎందుకు..? మంచితనం కొందర్ని ముంచేస్తుంది. ఆదమరిస్తే అధికారం వేరొకరి పాలవుతుంది. ఇప్పుడు ఆ “అదీపా”న్ని ఆర్పేయడానికి ప్రయత్నిస్తోందట. నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచిన ఆ ఎమ్మెల్యేని కొందరు పనిగట్టుకుని ముంచేయాలని చూస్తున్నారని టాక్. అదీ విశాఖపట్నం (Visakhapatnam) లోని ఓ బలమైన చిన్న జనాభా గల సామాజికవర్గమేనన్నది వినిపిస్తోన్న మాట.
ఆ ఎమ్మెల్యే నెమ్మదైన మనస్తత్వం.. చెప్పుడు మాటలు వినే తత్వం.. తొందరపాటు.. ఉడుకురక్తం కొన్ని వ్యతిరేక ప్రభావాల్ని తీసుకొస్తోంది. అధికారంలో ఉండే ఎమ్మెల్యే చేసే “పనులు” కూడా చేయలేని.. చేయించుకోలేని పరిస్థితిలో ఆయన పడిపోయారట. ఆఖరికి తన మేళ్లతో లబ్ధిపొందిన వాళ్లే తనను నాశనం చేస్తుంటే.. ఏం చేయాలో తెలియక బేల చూపులు చూస్తున్నారట.
ఇది చదవండి: విశాఖపై నాసా నిఘా..! తీరప్రాంతమే టార్గెట్..! కారణం ఇదే..!
ఐప్యాక్ (I PAC) స్టోరీ ఎమ్మెల్యే పరాభవానికి ఓ ఉదాహరణ. ఎమ్మెల్యే చలవతో.. ఆయన దయతో ఐ ప్యాక్ సంస్థలో చేరిన ఓ వ్యక్తి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తన వాళ్లకి అనుకూలంగా పెందుర్తి నియోజకవర్గంలో రిపోర్ట్ తయారు చేశాడు. అదే ప్రభుత్వానికి కూడా సమర్పించేశాడు. సదరు ఐప్యాక్ ఉద్యోగి.. నియోజకవర్గంలోని ఓ పెద్దమనిషికి కజిన్ అవుతాడు. అదే పెద్దమనిషి ఆ “అదీపాన్ని” ఆర్పేయడానికి “ఫ్యాన్” ను ఉపయోగిస్తున్నాడు. ఇది తెలుసుకుని తట్టుకోలేక ఎమ్మెల్యే అధినేతని కలిసినా.. చివరికి ఏం మిగల్లేదు. కేవలం అన్నీ చూస్తూ కూర్చోమని సలహా తప్ప. దీంతో ఆ అదీపం గాలికి భయపడి.. అటు ఇటూ ఊగిసలాడుతోంది.
కారణాలు ఏవైనా.. ఆ ఎమ్మెల్యే ప్రజాభిమానంతో.. జగన్ వేవ్ తో గెలిచారు. కానీ.. ఇప్పుడు అదే అభిమానం చప్పగా ఉంది. కొందరైతే డైరెక్ట్ గా నియోజకవర్గంలో తిట్టే పరిస్థితి వచ్చేసింది. ఆయన మాత్రం అన్నివిధాలా ప్రజా క్షేత్రంలో కష్టపడుతున్నారనేది నిజం. కానీ.. రాజకీయాల్లో ఎవరేంటనేది వర్క్ బట్టీ కాదు. వర్కవుట్ బట్టీ ఉంటుంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఆయన మళ్లీ టిక్కెట్టు పొందుతారనేది మాత్రం కష్టంగా మారింది. ఇంతకీ ఎమ్మెల్యేకి ఎవరి భరోసా ఉందయ్యా.. అంటే అది కేవలం ఆయన వ్యక్తిగత భరోసా అనేది కొసమెరుపు.