ఏపీ రాజధాని కేసులో కీలక మలుపు.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజభన చట్టంలోని నిబంధనల ప్రకారమే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానిగా అమరావతిని కొనసాగించే విషయంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ప్రకారం రాజధానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించారని.. సెక్షన్‌ 6ని అనుసరించి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీని నియమించినట్లు కేంద్రం తెలిపింది. ఈ కమిటీ నివేదికలో పొందుపరిచిన సూచనలు, సలహాలకు అనుగుణంగా.. అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ 2015 ఏప్రిల్‌ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని కౌంటర్‌ అఫిడవిట్‌లో కేంద్ర హోం శాఖ పేర్కొంది. దీనికి అనుగుణంగా రాజధాని ప్రాదేశిక ప్రాంత చట్టం- ఎపీసీఆర్‌డీఏని తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది.

ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 94లో రాజధానిలో.. రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌తో పాటు ముఖ్యమైన పట్టణ మౌలిక వసతుల కల్పనకు డబ్బులివ్వాల్సి ఉందన్నారు. ఆ మేరకు పట్టణాభివృద్ది మంజూరు చేసిన రూ. 1,000 కోట్లతో కలిపి.. మొత్తం రూ. 2,500 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ తరఫున అండర్‌ సెక్రటరీ శ్యాముల్‌ కుమార్‌ బిట్‌ ప్రమాణపత్రం దాఖలు చేశారు.

అయితే, 2020లో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏని రద్దు చేస్తూ.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలు నిర్ణయిస్తూ.. 3 రాజధానుల ప్రతిపాదనతో చట్టాలు చేసిందని కేంద్రం తెలిపింది. ఈ చట్టాలు చేసే ముందు తమతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదని.. తమకు చెప్పలేదని కేంద్రం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపిందని.. ఈ విషయంలో ఇంతకు మించి సమాధానం చెప్పడానికి ఏమీ లేదని కౌంటర్‌ అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. కౌంటర్‌తో పాటు.. శివరామకృష్ణన్‌ కమిటీ నియామకం, కమిటీ ఇచ్చిన నివేదిక, సిఫారసులు, సెక్షన్‌ 5, 6, 94కు సంబంధించిన డాక్యుమెంట్లు, 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ సీఆర్‌డీఏ చట్టం తీసుకొస్తూ.. విడుదల చేసిన జీవో 97కు సంబంధించిన కాపీలను కేంద్రం జత చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై ఈ నెల 23న సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *