కిమ్ జోంగ్ ఉన్ అధికారాన్ని కూతురుకు కట్టబెట్టనున్నారా?

ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో బుధవారం రాత్రి భారీ క్షిపణులు వరుసగా కవాతు చేశాయి. కానీ అక్కడ ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రదర్శిస్తున్నది కేవలం తన క్షిపణులను మాత్రమే కాదు.

కిమ్ పక్కనే ఆయన కూతురు కూడా ఉండటం ప్రధానాకర్షణగా నిలిచింది.

సైనిక కవాతు ప్రదర్శనను వీక్షించటానికి.. కిమ్ ఎప్పటి లాగానే బాల్కనీ మధ్యలో తన స్థానంలో కూర్చున్నారు. అసాధారణమైన విషయం ఏమిటంటే.. ఆయన పక్కనే ఆయన కూతురు కూడా కూర్చుంది. ఆ బాలిక నల్లటి దుస్తులు ధరించి ఉంది.

కిమ్ రెండో సంతానంగా భావించే ఆ బాలిక వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను కిమ్ జు యే అని పిలుస్తున్నారు.

మూడు నెలల వ్యవధిలో కిమ్ కూతురు తండ్రితో కలిసి బహిరంగ ప్రదర్శనల్లో పాల్గొనటం ఇది ఐదోసారి.

  • ఉత్తర కొరియా- 2023లో కిమ్ అణుబాంబును పరీక్షిస్తారా- ఉభయ కొరియాల మధ్య ఘర్షణ జరుగుతుందా-
  • కిమ్‌ జోంగ్ ఉన్: దీపావళి టపాకాయల్లా మిసైళ్లను పేలుస్తున్న ఉత్తరకొరియా అధినేత, అసలు లక్ష్యం ఏంటి?

ఈ స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా మారిపోయింది. ఉత్తర కొరియా భవిష్యత్ నేతగా ఆమెను ఎంపిక చేసుకున్నారన్న వాదన బలపడుతోంది.

కిమ్ జు యే గత ఏడాది నవంబర్‌లో తొలిసారి బహిరంగంగా కనిపించింది. ఖండాంతర బాలిస్టిక్ మిసైల్‌ను లాంచ్ చేస్తున్న సమయంలో తన తండ్రితో పాటు ఆమె కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించింది.

అప్పుడే చాలా ఊహాగానాలు చెలరేగాయి. ‘ఈ బాలిక ఓ రోజు ప్రపంచంలో అత్యంత రహస్య రాజ్యానికి సారథి అవుతుందా?’ అన్న గుసగుసలు వినిపించాయి.

కానీ అప్పుడు ఆ అంచనాలకు అంతగా బలం లేదు.

తెల్లని పఫర్ జాకెట్, ఎర్రని బాలే బూట్లు ధరించి జుట్టును పోనీ టెయిల్‌గా ముడివేసుకుని, తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్న ఆ బాలిక.. అప్పుడు చాలా చిన్న పిల్ల లాగా కనిపించింది.

బహుశా తనను మంచి తండ్రిగా ప్రపంచానికి చూపటానికి, తన ఆయుధాలతో పాటు తన కుటుంబం కూడా ఉంటుందని చాటటానికి కిమ్ తన కూతురును వెంటబెట్టుకుని వచ్చారామో అని కూడా అనుకోవచ్చు.

  • కిమ్ జోంగ్ తన కుమార్తెను ఎందుకు పరిచయం చేశారు, ఆయన ప్లాన్ ఏమిటి-
  • ఉత్తర కొరియాలో కోవిడ్ మిస్టరీ, అసలు ఏం జరుగుతోంది

కానీ.. కిమ్ జు యే తన తండ్రితో కలిసి బహిరంగ కార్యక్రమంలోకి వస్తున్న ప్రతిసారీ ఆమె స్థాయి అంతకంతకూ పెరుగుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది.

మంగళవారం రాత్రి క్షిపణుల పరేడ్‌కు ముందు.. ఉత్తర కొరియా ఉన్నతస్థాయి సైనిక అధికారుల కోసం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి కిమ్ కూతురు జు యే హాజరైంది.

ఈసారి ఆమె గంభీరమైన తెల్లటి చొక్కా, నల్లని స్కర్ట్ సూట్ ధరించింది. ఆమె జుట్టును వెనక్కి దువ్వి క్లిప్ పెట్టుకుంది.

ఉత్తర కొరియా పరిణామాలను పరిశీలించే చాలా మంది ఆ ఫొటోలు చూసి చిత్తరువులయ్యారు.

  • ఉప్పు నీరు, అల్లం, హెర్బల్ టీ.. ఉత్తర కొరియాలో కోవిడ్ రోగులకు ఇవే మందులు
  • ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య కౌగిలింతలు, కరచాలనాలు ముగిశాయా? ఇకపై ఏం జరుగుతుంది?

ప్రతి ఫొటోలోనూ ఆమే కేంద్ర బిందువుగా ఉంది. కిమ్ జు యే తన తండ్రికి, తల్లికి మధ్య కూర్చుని ఉంటే.. చుట్టూతా సైనికాధికారులు ఉన్నారు.

మరో ఆసక్తిరమైన విషయమేమిటంటే.. యువ కిమ్ జు యేను వర్ణించటానికి ఉపయోగించే భాష.

ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా ఆమెను మొదటిసారి పరిచయం చేసినపుడు కిమ్ జోంగ్ ఉన్ ‘ప్రియమైన’ పుత్రిక అని అభివర్ణించింది.

మంగళవారం నాటి మిలటరీ విందు నాటికి ఆమెను ‘గౌరవనీయమైన’ పుత్రిక అని ఆ మీడియా సంబోధించింది. ఉత్తర కొరియాలో ‘గౌరవనీయమైన’ అనే సంబోధన అత్యంత గౌరవించే వారికి మాత్రమే పరిమితమైన పదం.

గతంలో కిమ్ జోంగ్ ఉన్.. ఉత్తర కొరియాకు భవిష్యత్ నేత అవుతారన్న విషయం ఖరారైన తర్వాతే ఆయనను ‘గౌరవనీయమైన కామ్రేడ్’ అని సంబోధించారు.

ఉత్తర కొరియా ఆవిర్భవించినప్పటి నుంచీ ఈ దేశాన్ని కిమ్ కుటుంబం మూడు తరాలుగా పరిపాలిస్తోంది.

  • కిమ్ జోంగ్ ఉన్ యాక్షన్ హీరోలా ఎందుకు మారారు? ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగానికి హాలీవుడ్ ఎఫెక్ట్స్ ఎందుకు పెట్టారు?
  • ఒకప్పుడు అణు విధ్వంసంతో బాధపడ్డ జపాన్ ఇప్పుడు అణు బాంబులు తయారు చేయాలని ఎందుకు అనుకుంటోంది?

ఈ కుటుంబానికి ఒక పవిత్రమైన వారసత్వం ఉందని దేశ ప్రజలకు చెప్తుంటారు. దాని అర్థం దేశానికి ఈ కుటుంబం మాత్రమే నాయకత్వం వహించగలదని.

కిమ్ జోంగ్ ఉన్ అధికార దండాన్ని తమ కుటుంబంలో నాలుగో తరానికి అందించాలని తప్పకుండా కోరుకుంటారు.

కిమ్ కూతురు కిమ్ జు యేనే ఆయన వారసురాలని అనుకున్నప్పటికీ.. ఆమెను ఇంత చిన్నతనంలోనే, ఇంత త్వరగా ఎందుకు ముందుకు తెస్తున్నట్లు?

కిమ్ జోంగ్ ఉన్ వయసు ఇంకా 39 ఏళ్లే. ఆయన కూతురు జో యే వయసు ఇంకా 10 సంవత్సరాలే.

కిమ్ జోంగ్ ఉన్‌కు ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడే.. ఆయన తన వారసుడని తండ్రి కిమ్ జోంగ్-2 వెల్లడించారని చెప్తారు. అయితే అది కేవలం సైనిక నాయకులకు ప్రైవేటుగా మాత్రమే చెప్పేవాడని కథనం.

కిమ్ జోంగ్-2 చనిపోవటానికి కేవలం ఒక సంవత్సరం ముందు మాత్రమే.. ఆయన తర్వాత కిమ్ జోంగ్ ఉన్ పగ్గాలు చేపడతారనే విషయాన్ని బాహాటంగా స్పష్టం చేశారు.

దీనివల్ల ఆ పదవి చేపట్టినపుడు కిమ్ జోంగ్ ఉన్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన అధికారాన్ని బలోపేతం చేసుకోవటానికి ఆయన నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు.

బహుశా తన కూతురుకి పరిస్థితులు సాఫీగా సాగేలా చేయటానికి కిమ్ జోంగ్ ఉన్ ప్రయత్నిస్తుండవచ్చు. ఆమె అధికారం చేపట్టే సమయానికి ఆమె స్థాయిని సుస్థిరం చేయాలన్నది కిమ్ ఆలోచన కావచ్చు.

లేదంటే కిమ్ ఆరోగ్యం సరిగా లేదేమో. ఆయనకు మనం అనుకున్నంత ఎక్కువ సమయం లేదేమో. కానీ ఈ విషయాలు మనకు తెలియటం అసాధ్యం.

ఇవి కూడా చదవండి:

  • రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
  • పిల్లల భవిష్యత్ బంగారంలా ఉండాలంటే ఏ దేశానికి వెళ్లాలి? టాప్ 5 దేశాలు ఇవీ…
  • చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్‌మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
  • ఆంధ్రప్రదేశ్- విశాఖలో రుషికొండను గ్రీన్ మ్యాట్-తో కప్పేయడం వెనుక మతలబు ఏంటి-
  • బడ్జెట్ 2023- ఇకపై ఆదాయపన్ను ఎంత కట్టాలి… రూ. 3 లక్షలు అయితే ఎంత- 30 లక్షలు అయితే ఎంత-

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *