K Pawan Kumar, News18, Vijayawada
చేతికందిన కొడుకు వ్యసనాలకు బానిసై… అందినకాడికి అప్పులు చేయటంతో విసుగు చెందిన తల్లి… చేజేతులా కన్నపేగుని తెంచేసుకుంది. కొడుకు నిద్రించే సమయంలో రొకలిబండతో కొట్టి చంపేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా (Krishna District) ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్ద అవుటపల్లికి చెందిన రమాదేవి, సీతారామాంజనేయులకు దంపతుల కుమారుడు దీప్ చంద్. ఇతడి వయస్సు 30 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు.దీప్ చంద్ గృహోపకరణాల పనులు చేస్తూ జీవనం సాగిస్తూ.. పెద్ద అవుటూపల్లిలో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. తండ్రి డ్రైవర్. రోజువారీ విధుల్లో భాగంగా బుధవారం తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లాడు. భర్త వెళ్లిన కొద్దిసేపటికి భార్య రమాదేవి కూడా పాలు పితికేందుకు బయటకు వెళ్లింది.
అయితే రమాదేవి పని ముగించుకుని వచ్చే సరికి కొడుకు దీప్ చంద్ రక్తమడుగులో పడి చనిపోయిఉండటాన్ని గమనించింది. వెంటేనే కంగారుగా భర్తకు సమాచారం అందించింది. ఈ ఘటనపై వీఆర్వో జీ.శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీఐ నరసింహ మూర్తి, ఆత్కూర్ ఎస్సై సూర్య శ్రినివాస్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
ఇది చదవండి: కార్పొరేట్ కాలేజీల్లో చదువులే కాదు.. వేధింపులు కూడా ఎక్కువే..!
దీప్ చంద్ వ్యసనాలకు బానిసై… అప్పులు చేయటంతో పలుమార్లు అప్పులవారు ఇంటికి వచ్చేవారు. అప్పులు చేయటంపై దీప్ చంద్ ను తల్లి రమాదేవి మందలించింది. కానీ అతనిలో మార్పు రాలేదు. తాగి వచ్చి ఇంట్లో వారిని వేధిస్తూ,పైగా డబ్బులు కావాలని హింసించే వాడని తల్లి చెప్పింది. ఇలా ప్రతిసారి అప్పులు వాళ్లు వచ్చి అడగటంతో పరువు పోతుందని, కొడుకు ప్రవర్తనపై విసుగుచెంది.. తానే దీప్ చంద్ నిద్రమత్తులో ఉన్న కొడుకు తలపైరొకలి బండతో మోదీ చంపేసినట్లు గుర్తించారు పోలీసులు.
ఘటనపై పోలీసుల రమాదేవిని విచారించగా తానే చేసినట్లు ఒప్పుకొన్నట్లు.. డీఎస్పీ విజయపాల్ మీడియాకు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమాదేవిని అదుపులోకి తీసుకున్నారు. దీప్ చంద్ మృతదేహన్ని పోస్టుమార్టం చేసి తండ్రి రామాంజనేయులకు అప్పగించారు పోలీసులు.