తొలి 4 నిమిషాల సీన్‌తో ట్రైలర్.. ‘బిచ్చగాడు 2’ అప్‌డేట్ వచ్చేసింది!

తమిళ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని (Vijay Antony) హీరోగా మారి విజయవంతమైన సంగతి తెలిసిందే. తన సినిమాలను తానే నిర్మించుకుంటూ అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ‘బిచ్చగాడు’ సినిమా విజయ్ ఆంటోనీని స్టార్‌ను చేసింది. శశి దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘పిచైకారన్‌’. 2016లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించి విజయ్‌ ఆంటోని సినీ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమానే తెలుగులో ‘బిచ్చగాడు’గా అనువాదం చేసి విడుదల చేశారు.

‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్టు గతంలో విజయ్ ఆంటోని ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా విజయ్ ఆంటోని నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతున్న సమయంలో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ కోలుకున్నాక చెన్నైకి తీసుకొచ్చారు. ఈ మధ్యే ఆయన దవడకు సర్జరీ కూడా అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ఆంటోని ట్వీట్ కూడా చేశారు.

97771900

అయితే, విజయ్ అంటోని ప్రమాదానికి గురైన నేపథ్యంలో ‘బిచ్చగాడు 2’ సినిమాపై బోలెడన్ని పుకార్లు వచ్చాయి. వాటన్నింటికీ ఇప్పుడు స్వస్తి చెబుతూ తన సినిమా అప్‌డేట్ ఇచ్చారు విజయ్ ఆంటోని. ఈ సినిమా స్నీక్ పీక్ ట్రైలర్‌ను రేపు విడుదల చేస్తున్నట్టు విజయ్ ఆంటోని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అంతేకాదు, ఈ సినిమాలో మొదటి 4 నిమిషాల ఓపెనింగ్ సీన్‌ను స్నీక్ పీక్ ట్రైలర్‌గా తీసుకొస్తున్నట్టు విజయ్ స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్ విడుదలవుతుంది. ఓపెనింగ్ సీన్ మొత్తం ట్రైలర్ కింద తీసుకొస్తున్నారంటే ఈ సినిమాపై ఆయనకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.

ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తూ విజయ్ ఆంటోని చేసిన ట్వీట్‌లో మరో ఆసక్తికర విషయాన్ని పేర్కొన్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ డబ్బు చుట్టూ తిరుగుతుందని తెలిసిన విషయమే. దానికి తగ్గట్టుగానే.. ‘మనీ ఈజ్ ఇంజూరియస్ టు ద వరల్డ్’ అని ట్వీట్‌లో విజయ్ పేర్కొన్నారు. దీనికి తెలుగులో ‘డబ్బు లోకాన్ని ఖాళీ చేస్తుంది’ అని రాశారు. ఈ ఏడాది వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డిజిటైల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. అలాగే, శాటిలైట్ రైట్స్ స్టార్ బ్రాడ్‌కాస్టింగ్ గ్రూప్ కొనుగోలు చేసింది. అంటే, తెలుగులో స్టార్ మా టీవీలో, తమిళంలో విజయ్ టెలివిజన్‌లో ‘బిచ్చగాడు 2’ సినిమా ప్రీమియర్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *