Yanamala Tuni Seat: టీడీపీ (TDP)లో యనమల కుటుంబంలో సీటు వ్యవహారానికి పుల్‌స్టాప్ పెట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu). యనమల దివ్య (Yanamala Divya)కు తుని బాధ్యతలు అప్పగించడంతో.. మొన్నటి వరకు ఇంఛార్జ్‌గా ఉన్న యనమల కృష్ణుడు (Yanamala Krishnudu) అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపించింది. ఈ క్రమంలో ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జ్ వరుపుల రాజాతో కలిసి చంద్రబాబును కలిశారు. ఈ భేటీలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu ), ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఉన్నారు.
తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని.. యనమల దివ్య నాకూ కూతురు లాంటిది అన్నారు కృష్ణుడు. ఆమె విజయానికి కృషి చేస్తాని.. తను నియోజకవర్గ బాధ్యతలు దివ్యకు అప్పగించడంపై తాను అసంతృప్తిగా ఉన్నానని ప్రచారంలో నిజం లేదన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇద్దరం పార్టీలోనే కొనసాగుతున్నామని.. ఇప్పుడూ కొనసాగుతామన్నారు. 40 ఏళ్లుగా రామకృష్ణుడి విజయం కోసం కష్టపడ్డానని.. ఇప్పుడు దివ్య విజయానికి కృషి చేస్తాను అన్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీతో తాను సంతృప్తిగా ఉన్నానన్నారు.
తనకూ, తన సోదరుడు యనమల రామకృష్ణుడికి మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. అసలు అసంతృప్తి అనే మాటే లేదన్నారు. చంద్రబాబుపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో యాదవుల ఐక్యతకు కృష్ణుడు కృషి చేస్తారని.. ఆయన్ను పార్టీ రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారని టీడీపీ నేతలు తెలిపారు.
కొద్దిరోజుల క్రితం తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్‌గా యనమల దివ్యను నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె అధినేత చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. దివ్య కూడా త్వరలో నియోజకవర్గానికి వెళ్లనున్నారు.. అక్కడ కార్యకర్తలు, నాయకులతో సమావేశంకానున్నారు.
తుని సీటు విషయంలో యనమల కృష్ణుడు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరిగింది. గతంలో దివ్యకు తుని టీడీపీ సీటు ఇస్తారనడంతో.. కృష్ణుడు ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. కష్టపడితే కూతురుకు సీటు ఇస్తారా అని అడగాలని.. ఊరికి 40 మంది కలిసి వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించాలని ఆడియోలో కార్యకర్తల్ని కోరారు. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని గట్టిగా చెప్పాలని.. దివ్య ఇంట్లో ఉంటుందని వ్యాఖ్యానించారు. తనకు చెప్పకుండా ఈ విధంగా చేయడంతో తనకు అన్యాయం జరిగిందన్నారు. అనుకున్నట్లే దివ్యకు ఇంఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. కృష్ణుడును పిలిచి తుని వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు.
Read Latest
Andhra Pradesh News
and