India vs Australia 2023: ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో తాను వేసిన తొలి బంతికే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వికెట్ పడగొట్టాడు. మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ బ్యాటింగ్ ఎంచుకోగా.. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా (Usman Khawaja) ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. అయితే.. తొలి ఓవర్ వేసిన మమ్మద్ షమీ రెండు పరుగులు ఇవ్వగా.. రెండో ఓవర్ వేసిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఫస్ట్ బాల్‌కే వికెట్ పడగొట్టాడు.
మహ్మద్ సిరాజ్ లెగ్ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని విసిరిన బంతిని డిఫెన్స్ చేసేందుకు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (1: 3 బంతుల్లో) ప్రయత్నించాడు. కానీ అతని బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. దాంతో ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం భారత్ జట్టు అప్పీల్ చేసింది. అయితే.. ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం ఔట్ ఇవ్వలేదు. కానీ.. బంతి కరెక్ట్ లైన్‌లోనే ల్యాండ్ అయ్యిందని ధీమా వ్యక్తం చేసిన బౌలర్ మహ్మద్ సిరాజ్.. డీఆర్ఎస్ కోరాల్సిందిగా కెప్టెన్ రోహిత్ శర్మకి సూచించాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్‌తో మాట్లాడిన అనంతరం వికెట్ కీపర్ కేఎస్ భరత్ (KS Bharat)ని బంతి గమనం గురించి అడిగాడు. దాంతో ఈ కోనసీమ కుర్రాడు తొలి మ్యాచ్ ఆడుతున్నా.. బంతి గమనాన్ని సరిగ్గా అంచనా వేసి లైన్‌లోనే ల్యాండ్ అయ్యి స్టంప్‌ని తాకేలా కనిపించినట్లు ధీమాగా రోహిత్ శర్మకి చెప్పాడు. దాంతో ఇద్దరు తెలుగు క్రికెటర్లని నమ్మిన రోహిత్ శర్మ ధైర్యంగా డీఆర్‌ఎస్ కోరాడు. అతని నమ్మకం వమ్ము కాలేదు. రిప్లైలో బంతి లెగ్ స్టంప్‌పై పడి.. నేరుగా లెగ్ స్టంప్‌ని తాకేలా కనిపించింది. దాంతో అంపైర్ తన నాటౌట్ నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
డీఆర్‌ఎస్ సక్సెస్ కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. మహ్మద్ సిరాజ్‌ని అభినందిస్తూ.. కేఎస్ భరత్‌ని కూడా మెచ్చుకుంటూ కనిపించాడు. గత మూడేళ్లుగా భారత్ జట్టుతో ఉన్న కేఎస్ భరత్‌కి ఇదే అరంగేట్రం మ్యాచ్. రిషబ్ పంత్‌కి ఇటీవల యాక్సిడెంట్ కావడంతో భరత్‌కి ఛాన్స్ దక్కింది.
Read Latest
Sports News
,
Cricket News
,