టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చాలా కూల్‌గా కనిపిస్తుంటారు. మ్యాచ్ ఎంత ఉత్కంఠగా జరుగుతున్నా స్టేడియంలోని టీమిండియా డగౌట్‌లో కూర్చుని నింపాదిగా చూస్తుంటారు. అలాంటి రాహుల్ ద్రవిడ్ ఈరోజు భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా మొదలైన తొలి టెస్టు ఆరంభంలోనే ఎమోషనల్ అయిపోయారు. దానికి కారణం భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేసిన తీరు.
హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ సిరాజ్.. మ్యాచ్‌లో తాను వేసిన మొదటి బంతికే ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (1)ని వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నాడు. మహ్మద్ సిరాజ్ లెగ్ స్టంప్‌కి వెలుపలగా బంతి వేసినట్లు కనిపించడంతో ఉస్మాన్ ఖవాజా ప్లిక్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి ఊహించని విధంగా లెగ్ స్టంప్ లైన్‌పై ల్యాండ్ అయ్యి నేరుగా దూసుకెళ్లింది. దాంతో ఖవాజా బ్యాట్‌కి దొరకని బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. వెంటనే ఔట్ కోసం సిరాజ్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అంటూ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు.
కానీ బంతి కచ్చితంగా స్టంప్‌లను తాకబోతోందని ధీమా వ్యక్తం చేసిన సిరాజ్.. డీఆర్‌ఎస్ కోరాల్సిందిగా కెప్టెన్ రోహిత్ శర్మని రిక్వెస్ట్ చేశాడు. అనంతరం వికెట్ కీపర్ కేఎస్ భరత్‌తో మాట్లాడిన రోహిత్ శర్మ రివ్యూ కోరగా.. రిప్లైలో ఔట్ అని తేలింది. దాంతో డగౌట్‌లో అప్పటి వరకూ ఉత్కంఠగా ఎదురుచూసిన రాహుల్ ద్రవిడ్.. ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇటీవల కాలంలో రాహుల్ ద్రవిడ్‌ని ఎప్పుడూ ఇంత ఎమోషనల్‌గా చూడలేదంటూ నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.
Read Latest
Sports News
,
Cricket News
,