తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రల కాలం నడుస్తోంది. ఏపీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), వైఎస్సార్‌టీపీ (Ysrtp) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys Sharmila) కూడా యాత్రలు చేస్తున్నారు. అలాగే తెలంగాణ బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) కూడా పాదయాత్రలు చేశారు. అయితే ఈ పాదయాత్రలపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (Jc Diwakar Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జేసీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏపీ మాజీ మంత్రి శైలజానాథ్ ఉండగా.. వారితో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన జేసీ.. పాదయాత్రల టాపిక్ తీసుకొచ్చారు. గతంలో పాదయాత్రలు వేరని.. ఇప్పుడు వేరని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అన్నీ డబ్బుతో కూడుకున్న యాత్రలేనని వ్యాఖ్యానించారు.
టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్రతో లాభం లేదని.. ఆయనతో సహా రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేసినా.. ఎవరు చేసినా లాభం లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రలకు కాలం చెల్లిందని, జనాలు పట్టించుకోవడం లేదన్నారు. జేసీ పాదయాత్రలపై చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దివాకర్ రెడ్డి కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత కేవలం నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. రాజకీయాలపై ఎక్కడా మాట్లాడటం లేదు. మళ్లీ చాలా రోజుల తర్వాత ఆసక్తికరంగా మాట్లాడారు. తన మనసులో మాటను బయటపెట్టారు.