స్కూల్‌లో పాము కాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి.. ‘ఈ పాపం ఎవరిది ?’

Snake bite: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామపంచాయతీ పరిధిలోని భట్టుతండాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పాముకాటుకు గురై ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. తండాకుచెందిన భట్టు మోహన్, పార్వతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్ద కూమార్తె భట్టు మన్విత (6) తండాలోని ప్రైమరీ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతోంది. నిన్న (బుధవారం) మన్వితకు చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహించాలని తల్లిదండ్రులు భావించారు. కార్యక్రమానికి రావాల్సిందిగా.. చుట్టూలను సైతం ఆహ్వానించారు.

వేడుకకు వచ్చిన బంధువులతో ఇళ్లంతా నిండిపోయింది. ఈ క్రమంలో తన స్నేహితులకు చెప్పొస్తానని మన్విత ఎంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్లింది. తనకు చెవులు కుట్టిస్తున్నారంటూ మురిసిపోతూ స్నేహితులకు చెప్పింది. అనంతరం టాయిలెట్‌కు వెళ్లివస్తానని స్కూల్‌లో టీచర్ పర్మిషన్ తీసుకొని బాత్‌రూంకు వెళ్లింది. స్కూల్ మెట్లు దిగుతున్న క్రమంలో చిన్నారిని పాము కాటేసింది. వెంటనే స్కూల్ టీచర్ విషయాన్ని మన్విత తండ్రికి తెలియజేసింది.

ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పరుగుపరుగున పాఠశాలకు వచ్చి చిన్నారని నర్సంపేట హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. తనకు చెవులు కుట్టిస్తున్నారని ఎంతో మురిసిపోయిన తమ కూతురు ఇలా విగతజీవిగా మారటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోధనలు స్థానికులను కలిచివేశాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ పాపం ఎవరిది ?

చిన్నారి మృతి ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఎవరిదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్.. పాఠశాలలను బాగు చేస్తే పాములు ఎందుకు వస్తాయని నిలదీశారు. ‘మన ఊరు- మన బడి పథకం పేరిట కోట్ల రూపాయలు మెఘా-ర్పణం చేసి, పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ, ఈ పాపం ఎవరిది ? వందల కోట్లు ఏ పంది కొక్కులు బుక్కినయ్ ? ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను నిర్వీర్యం చేయడమేనా మీ లక్ష్యం ?’ అని ట్విట్టర్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

97726335

Read More Telangana News And Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *