D Prasad, News18, Kadapa
బ్రిటీష్ పరిపాలన సమయంలో మన కడప (Kadapa) నగరంలో నిర్మించిన అనేకమైన భవనాలు నేటికి చెక్కు చెదరకుండా ఆనాటి వైభవాన్ని నిదర్శనంగా మన కండ్లముందు కనపడుతున్నాయి. అలాంటి వాటిలో మొట్ట మొదటగా చెప్పుకోవాల్సి వస్తే ముందుగా మన నగరంలోని నట్ట నడి సెంటర్ లో వున్న పాత కలెక్టరేట్ భవనం యొక్క విశిష్టత తెలుసుకోవాలి. ఈ భవనాన్ని అప్పటి బ్రిటీష్ పాలకులు 1889 వ సంవత్సరంలో పటిష్టంగా అతి సుందరంగా నిర్మించారు. నగరానికి సంబంధించిన పరిపాలనని ఇక్కడి నుండే కలెక్టర్లు, వైస్రాయి ఈ భవనం నుండే పరిపాలన కొనసాగించేవారిని ఇక్కడి చరిత్రకారులు చెపుతున్నారు.
ఈ కలెక్టరేట్ భవనం నుండి బ్రిటీష్ కాలంలో 65 మంది కలెక్టర్లు, భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 44 మంది జిల్లా కలెక్టర్లుగా ఈ భవనం నుంచి తమ విధులను నిర్వర్తించారు. ఆ తర్వాత జిల్లాకు చెందిన డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించబడిన నూతన కలెక్టరేట్ భవనాల సముదాయంలోనికి కలెక్టరేట్ కార్యాలయాన్ని తరలించారు.మొత్తంగా ఈ కలెక్టరేట్ భవనం నిర్మించి 134 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఇది చదవండి: ఏపీలో ప్రాచీన జైన మందిరం.. ప్రశాంతతకు చిహ్నంగా నిర్మాణం
బ్రిటీష్ రాజరిక నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ భవన నిర్మాణ వ్యయం అప్పట్లో కేవలం 2 లక్షల 50 వేల రూపాయలు మాత్రమే అని చరిత్ర కారులు చెపుతున్నారు. అటువంటి చారిత్రక భవనం నేడు కేవలం కొన్ని రకాల కార్యాలయాలకి మాత్రమే నెలవై, ఆనాటి వైభవాన్ని కోల్పోయింది అని చెప్పవచ్చు.