Monkeys Deadbodies Thrown Near Beach: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కే పి పాలెంలో దారుణం చోటుచేసుకుంది. కేసీ పాలెం సౌత్ బీచ్ సమీపంలో ఉన్న సరివి తోటల్లో 100 కుపైగా కోతుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడేసి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తోటలో కోతుల మృతదేహాలు విసిరేసినట్టుగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇటీవల ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో కోతుల సంచారం ఎక్కువైందని.. ముఖ్యంగా మొగల్తూరు ప్రాంతంలోని మామిడి తోటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయని ఫిర్యాదులు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడిలా పదుల సంఖ్యలో కోతుల మృతదేహాలు పడి ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికే ఎవరో విష ప్రయోగం చేసి చంపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
దేవుడిలా పూజించే వానరాలను ఇలా చంపి పడేయడం చాలా దారుణమని.. కోతులను హతమార్చిన నిందితులపై అధికారులు వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే, మరోవైపు కోతులను పడేసిన ప్రదేశం బీచ్‌కి అతి సమీపంలోనే ఉండటంతో కోతుల కళేబరాల నుంచి వచ్చే దుర్వాసన అక్కడి పరిసరాలను కలుషితం చేస్తోంది అని బీచ్‌కి వచ్చే సందర్శకులు, పర్యాటకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.