కంటెంట్ కొత్తగా ఉంటే చాలు.. కళ్యాణ్ రామ్ కమర్షియల్ లెక్కల్ని దూరం పెట్టేస్తారు. దర్శకుడు కొత్తోడా.. పాతోడా.. అతనికి హిట్లు ఉన్నాయా.. కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుందా.. లేదా? అన్నది ఆయనకి సెకండరీ. ముందు మన ప్రయత్నం మనం చేస్తే విజయం దానంతట అదే వస్తుందన్న ధీమాతో కొత్త దర్శకుల్ని.. కొత్త సబ్జెక్ట్‌లను ఎంకరేజ్ చేస్తుంటారు కళ్యాణ్ రామ్. ఇప్పుడు అదో కోవలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అమిగోస్’ (Amigos Telugu Movie). అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్ధం. మరి ఈ ముగ్గురి ఫ్రెండ్స్ కథ ఎంత వరకూ ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
మనుషుల్ని పోలిన మనుషులు ముగ్గురు. విరుద్ధభావాలు కలిగిన ఈ ముగ్గురిలో ఒకరు రాక్షసుడు (మైఖేల్-కళ్యాణ్ రామ్).. ఇంకొకరు అమాయకుడు (మంజునాథ్-కళ్యాణ్ రామ్).. ఇంకొకడు తెలివైన వాడు (సిద్ధార్ధ్-కళ్యాణ్ రామ్). ఈ ముగ్గురూ డోపెల్‌గ్యాంగర్ (doppelganger website) అనే వెబ్ సైట్ ద్వారా కలుస్తారు. స్నేహితులుగా మారతారు. అయితే మోస్ట్ వాటెండ్ క్రిమినల్ అయిన బిపిన్ రాయ్ వేటాడుతూ ఉంటారు ఎన్ఐఏ అధికారులు. వారి నుంచి తప్పించుకోవడం కోసం.. బిపిన్ రాయ్.. మైఖేల్‌గా మారి సిద్దార్ధ్, మంజునాథ్‌లను ఇరికిస్తాడు. తాను బతకడం కోసం ఎవర్నైనా చంపేసే బిపిన్.. మంజునాథ్, సిద్ధార్థ్‌లను చంపేయాలను చంపేసి.. విదేశాలకు పారిపోదాం అనుకుంటాడు. అయితే ఆ రాక్షసుడి బారి నుంచి మంజునాథ్, సిద్దార్థ్‌లు ఎలా తప్పించుకోగలిగారు? బిపిన్ రాయ్‌ని ఎలా మట్టుపెట్టారు అన్నదే మిగిలిన ‘అమిగోస్’ కథ.
ఇలాంటి టఫ్ సబ్జెక్ట్‌ని డీల్ చేసేప్పుడు సాన పెట్టాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ బ్యాలెన్స్ చేయడంలో లాజిక్‌లు మిస్ అయినా.. ప్రేక్షకుడ్ని నిరుత్సాహపరచకుండా తీసిన సినిమా ఇది. సిద్దూ పాత్రతో కథను మొదలు పెట్టి.. ఒక్కో పాత్రను పరిచయం తీరు.. మూడు క్యారెక్టర్స్‌ని నడిపించిన విధానం బాగుంది. ఇషికా- సిద్దు (అషికా రంగనాథ్-కళ్యాణ్ రామ్)ల లవ్ ట్రాక్ రొటీన్ ఫార్మేట్‌లోనే ఉన్నా.. బోరింగ్‌గా అయితే అనిపించదు. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తుంది. త్రిపాత్రాభినయం కాన్సెప్ట్ ముగ్గురు మొనగాళ్లు, జై లవకుశ సినిమాలను గుర్తుకి తెచ్చినా.. వాటిలో మూడు పాత్రలకు బ్లడ్ రిలేషన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఒకేలా పుట్టడం కొత్త కాన్సెప్ట్. పైగా ఆ సినిమాల్లో క్రూరంగా మారిన వ్యక్తికి గట్టి నేపథ్యం ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఫక్తు విలనిజం కోసమే బిపిన్ రాయ్ పాత్ర అనేట్టుగా ఉంటుంది.
దర్శకుడు రాజేంద్రరెడ్డికి ఇది తొలిసినిమానే అయినా.. అనుభవం ఉన్న దర్శకుడిలా ‘అమిగోస్’ని తీర్చిదిద్దారు. పాత్రల పరిచయంతో ఫస్టాఫ్‌ని సాఫీగా సాగించి.. థ్రిల్ రైడ్స్ బిగెన్స్ అంటూ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై ఆసక్తిపెంచారు. అయితే మైఖేల్.. బిపిన్ రాయ్ ఒక్కరే అనే ట్విస్ట్ బయటపడిన తరువాత థ్రిల్ రైడ్ వేగం తగ్గింది.క్లైమాక్స్ ఏమౌతుందనే విషయం ప్రేక్షకుడి ముందే తెలిసిపోవడంతో.. ముగింపు రొటీన్‌గా అనిపిస్తుంది.
కళ్యాణ్ రామ్ కష్టాన్ని మెచ్చుకోవచ్చు. త్రిపాత్రాభినయంలో చక్కని వైవిధ్యం కూడా చూపించాడు. అతని నటనలో, కదలికల్లో, హావభావాల్లో మెచ్యురిటీ కనిపిస్తుంది. డిఫరెంట్ వేరియేషన్స్ మూడు పాత్రల్ని ఒకేసారి చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ కళ్యాణ్ రామ్.. పాత్రల మేకోవర్ విషయంలో పరిణితి సాధించారు. మైఖేల్.. సిద్ధార్థ్.. మంజునాథ్ ఈ మూడు పాత్రల్లోనూ డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ.. విలక్షణ నటనా ప్రతిభ ఉన్న నటుడిగా తనలోని యాక్టింగ్ స్కిల్స్‌కి పదునుపెట్టాడు. అయితే క్లోజప్ షాట్స్‌లో ఎక్స్ ప్రెషన్స్ పలికించే ‘దమ్ము’న్న నటుల జాబితాలో చేరడానికి కళ్యాణ్ రామ్‌కి ఇంకాస్త సమయం పట్టొచ్చు. మైఖేల్‌గా తనలోని రాక్షసత్వాన్ని అద్భుతంగా పలికించిన కళ్యాణ్ రామ్.. చాలా చోట్ల సింగిల్ ఎక్స్‌ప్రెషన్స్‌కే పరిమితం అయ్యారు.
కళ్యాణ్ రామ్-అషికా జంట స్క్రీన్‌పై బాగుంది. అషికా రంగనాథ్‌కి తెలుగులో ఇది మొదటి సినిమానే అయినప్పటికీ కన్నడలో పాపులర్ నటి. దీంతో కొత్త హీరోయిన్ అనే ఫీలింగ్ రాకుండా చేసింది. తన ఆర్జే ఇషికా పాత్రకి న్యాయం చేసింది. తన గ్లామర్ షోతో కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీకి మంచి రోల్ పడింది. హీరోకి మామయ్యగా ఇంపార్టెంట్ రోల్‌లో నటించి.. హాస్యం పండించారు. ఒకరకంగా త్రిపాత్రాభినయం చేయడం కళ్యాణ్ రామ్‌కి ఎంత కష్టమో.. అతనికి సపోర్టింగ్ రోల్ చేసిన బ్రహ్మాజీ కూడా అంతే కష్టపడ్డారు. లేని పాత్రల్ని ఊహించుకుంటూ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.. ఈ విషయంలో బ్రహ్మాజీ తన సీనియారిటీని చూపించారు. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో అయ్యేపాపం అనేట్టుగా చేశారు.
త్రిపాత్రాభినయం అంటే నటించే నటులకు ఎంత పెద్ద టాస్కో.. కెమెరా లీడ్ చేసే సినిమాటోగ్రాఫర్‌కి అంతకు మించి పెద్ద టాస్క్. ఫ్రేమ్ టు ఫ్రేమ్.. త్రీ క్యారెక్టర్స్‌ని బ్యాలెన్స్ చేయాలి. సీన్ టు సీన్.. లేని పాత్రల్ని ఉన్నట్టుగా ఊహించి మరీ ఫ్రేమ్‌లు పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయంలో సీనియర్ కెమెరామెన్ సుందర్ రాజన్ కెమెరా పనితీరు ప్రశంసనీయం అనేట్టుగానే ఉంటుంది. విజువల్స్ రిచ్‌గా అనిపిస్తాయి.. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్‌గా బాగా చూపించారు. ఎన్నోరాత్రులొస్తాయి గానీ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది.
ఇక జీబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. ఒకే గెటప్‌లో ఉన్న మూడు పాత్రల్ని గుర్తుపట్టడానికి జీబ్రాన్ నేపథ్య సంగీతం చాలా వరకూ సహకరిస్తుంది. ముఖ్యంగా మైఖేల్ వచ్చినప్పుడు.. వచ్చే ఆర్ఆర్.. అతని పాత్రని ఎలివేట్ చేసింది. ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ’.. సాంగ్‌లో ఒరిజినల్ ఫ్లేవర్‌ని డిస్ట్రబ్ చేయకుండా నీట్ ప్రజెంట్ చేశారు. ఆ పాట పాడిన ఎస్పీ చరణ్ మరోసారి ఎస్పీ బాలుని గుర్తు చేశారు. ప్రొడక్షన్స్ వాల్యూస్ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ అనవసరమైన ఖర్చులకు పోకుండా ఉన్నంతలో వర్కౌట్ చేశారు. నిజానికి మూడు పాత్రల్ని మూడు దేశాల్లో పరిచయం చేసి.. భారీ తనం నింపే స్కోప్ ఉన్నప్పటికీ.. కలకత్తా, హైదరాబాాద్, బెంగుళూరులలో మూడు పాత్రల్ని పరిచయం చేసి బడ్జెట్‌లో చాలా వరకూ పొదుపు పాటించారు. క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడలేదు. యాక్షన్ సన్నివేశాలకు బాగానే ఖర్చు చేశారు.
మొత్తంగా.. అమిగోస్ చిత్రంతో కళ్యాణ్ రామ్ అద్భుతం చేశాడు అని చెప్పలేం కానీ.. ప్రేక్షకుల్ని అయితే నిరాశపరచలేదు. త్రిపాత్రాభినయంతో నందమూరి ఫ్యాన్స్‌కి ‘ట్రిపుల్’ కిక్ ఇచ్చారు.