Click here to see the BBC interactive
కల్యాణ్ రామ్‌ను ద్వితీయ విఘ్నాలు తొలి నుంచి వెంటాడుతున్నాయి. ఒక విజయం తర్వాత మళ్లీ వరుసగా అపజయాలు. ‘పటాస్’ తో ఫామ్ లోకి వస్తే.. ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా నిరాశ పరిచాయి.
‘బింబిసార’తో విజయం అందుకున్న కల్యాణ్ రామ్.. ఈసారి ఎలాగైనా ద్వితీయ విఘ్నాన్ని దాటాలని… ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కోసం కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేశాడు.
ట్రైలర్ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. మరి ట్రైలర్‌లో కనిపించిన ఆసక్తి సినిమాలో కొనసాగిందా?
- రామచరిత మానస్: తులసీదాస్ రాసిన ఈ గ్రంథం మహిళలను, దళితులను కించపరుస్తోందా… ఎందుకు వివాదం
- భోగాపురం ఎయిర్‌పోర్టు: నిర్వాసితులను బలవంతంగా తరలిస్తున్నారా… గ్రామస్తులు ఏమంటున్నారు…
ముగ్గురు ముగ్గురే
సిద్ధు (కళ్యాణ్ రామ్) తన ఫ్యామిలీ బిజినెస్ చూస్తూ ఉంటాడు. అతనికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు కానీ ఎవరూ నచ్చరు. తను కోరుకునే క్యాలిటీలు ఉన్న అమ్మాయిని పెళ్లి చూసుకోవాలని సిద్ధు కోరిక.
ఇషిక (ఆషికా రంగనాథ్) ఆర్జే. తను కూడా కాబోయే భర్తలో కొన్ని క్యాలిటీలని కోరుకుంటుంది. ఇషికని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు సిద్ధు. అయితే పెళ్లికి ఒప్పుకోవాలంటే మాత్రం సిద్ధుకి కొన్ని కండీషన్లు పెడుతుంది.
ఇదే సమయంలో డోపెల్‌గాంజర్స్ అనే ఓ వెబ్ సైట్ ద్వారా అచ్చం తన పోలికలతో ఉన్న మంజునాథ్, బిపిన్ రాయ్ సిద్ధుకి పరిచయం అవుతారు. సిద్ధు జీవితంలోకి ఈ ఇద్దరు రావడంతో అతని పెళ్లి సమస్య తీరిపోతుంది.
అయితే ఇదే సమయంలో బిపిన్ రాయ్ రూపంలో ఓ ప్రమాదం వచ్చి పడుతుంది. అసలు బిపిన్ రాయ్ ఎవరు? సిద్ధు జీవితంలోకి అతడి రాకతో ఎలాంటి సమస్యలు తలెత్తాయి? ఈ సమస్యల నుంచి సిద్ధు ఎలా బయటపడ్డాడనేది మిగతా కథ.
ఒకే పోలికలతో వున్న ముగ్గురి కథ ఇది. ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులని డోపెల్‌గాంజర్స్ అంటారు. అయితే ఈ మాట కొందరికి కొత్తగా పరిచయం అవుతుందేమో కానీ ఇలాంటి కథలు మాత్రం ప్రేక్షకులు ఇది వరకే చూశారు.
ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు ఒకరి స్థానంలో మరొకరు వచ్చి అవసరాలకు తగ్గట్టు నటించడం గతంలో చాలా కథల్లో చూశాం. అయితే అమిగోస్‌లో మాత్రం ముగ్గురిని కలిపిన పద్ధతి బాగుంది. తర్వాత డ్రామా నడిపించే విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ఇది కాస్త కొత్తగా అనిపించినా.. దానిని కొనసాగించడంలో చాలా చోట్ల సాగదీత కనిపిస్తుంది.
ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు కలవడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే ఈ పాయింట్ చేరుకోవడానికి ముందు దర్శకుడు ప్రేమకథతో చాలా కాలయాపన చేశాడు. అమిగోస్ ఒక థ్రిల్లర్. ఈ కథలో లవ్ ట్రాక్‌కి అంత ప్రాధాన్యం లేదు. అలాంటప్పుడు ఆ ట్రాక్‌ను షార్ప్‌గా తీయాల్సింది. కానీ అలా జరగలేదు.
ఒకే పోలికతో ఉన్న ముగ్గురు కలవడం.. ఎన్ఐఎ అధికారులు రంగంలోకి దిగడంతో.. విరామం ఘట్టం కూడా ప్రేక్షకుడి ఊహకి అందిపోతుంది. అయినప్పటికీ ఆ ఎపిసోడ్ని కాస్త ఆసక్తిగానే డిజైన్ చేశాడు దర్శకుడు.
- ఆవులను కౌగలించుకోవడం ప్రపంచంలో కొత్త వెల్‌నెస్ ట్రెండా? ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- జస్టిస్ విక్టోరియా గౌరీ: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఆమెను నియమించడంపై ప్రశ్నలు ఎందుకు?
థ్రిల్ వుంది కానీ..
విరామం తర్వాత వచ్చే బిపిన్ రాయ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇండియన్ పాబ్లో ఎస్కోబార్‌గా ఆ పాత్రని చాలా పవర్ ఫుల్‌గా పరిచయం చేశారు. అయితే దాన్ని కొనసాగించడంలో దర్శకుడిలో తడబాటు కనిపించింది.
పైగా, దర్శకుడు కథకి సహజంగా కాకుండా తనకి అనుకూలంగా చాలా సన్నివేశాలని రాసుకుంటూ వెళ్ళాడు. ఎన్ఐఎ ప్రవేశించిన ఓ కేసులో విచారణ చాలా పటిష్టంగా ఉంటుంది. కానీ వాళ్లు అసలు విచారించినట్లే కనిపించదు.
మంజునాథ్ పాత్రని అమాయకంగా తీర్చిదిద్ది ఒక సింపతీని క్రియేట్ చేయాలనే దర్శకుడు ఆలోచన అంతగా ఫలించలేదు.
ఫస్ట్ హాఫ్‌లో థ్రిల్‌కు లవ్ ట్రాక్ అడ్డు తగిలితే సెకండ్ హాఫ్‌లో ప్రీక్లైమాక్స్ అవరోధంగా మారింది. బిపిన్ ఎన్ఐఎ అధికారులకు దొరికినపుడే ఈ కథ అయిపోతుంది. కానీ అక్కడ పెద్ద యాక్షన్ సీన్ పెట్టి ఇంకో ఇరవై నిమిషాలు సాగదీశారు. ఇక క్లైమాక్స్‌లో కూడా ఏం జరుగుతుందో ప్రేక్షకులకు ముందే ఒక ఐడియా వుంటుంది.
అయితే చివరికి క్లైమాక్స్ ఫైట్‌ను కూడా సాగదీసి రొటీన్ గానే ముగించారు. అలా కాకుండా వాటి నిడివి తగ్గించుంటే ఆడియన్స్‌కు థ్రిల్ కలిగేదే.
అమిగోస్ విషయంలో దర్శకుడిని మెచ్చుకోదగ్గ విషయాలు కూడా వున్నాయి. ఇలాంటి కథల్లో పాత్రలు అవసరాలకు తగట్టు మారిపోతుంటాయి. పాజిటివ్ పాత్ర సడన్‌గా నెగిటివ్ అయిపోతుంటుంది. కానీ దర్శకుడు ఆ జోలికి వెళ్ళలేదు. పాత్రలకి ఒకటే గ్రాఫ్‌ని కొనసాగించాడు. అలాగే ఒకే పోలికలతో వున్న పాత్రలని చూపిస్తున్నపుడు చాలా తికమక వుంటుంది. అమిగోస్‌ని మాత్రం ఎలాంటి కన్ఫ్యుజన్ లేకుండా నీట్‌గా ప్రజంట్ చేశాడు దర్శకుడు.
- అదానీ గ్రూప్ వారం రోజుల్లో లక్షల కోట్లు నష్టపోయింది… మరి లాభపడింది ఎవరు?
- తుర్కియే భూకంపం: మరణాలు పెరగడానికి ప్రభుత్వమే కారణమా… అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడమే తీవ్రతను పెంచిందా
కల్యాణ్ రామ్ ‘త్రీ’ మెన్ షో
కల్యాణ్ రామ్ పోషించిన మూడు పాత్రల్లో ఒకటి ప్రతినాయకుడి లక్షణాలు ఉన్న పాత్ర. ఈ మూడు పాత్రల్లో తన గ్రేస్ చూపించాడు కల్యాణ్ రామ్. కల్యాణ్ రామ్‌కు నటించే అవకాశం ఇచ్చిన కథ ఇది. మూడు పాత్రల్లో స్పష్టమైన వైవిధ్యం చూపించాడు. రూబిన్ పాత్ర ఇందులో ప్రధాన ఆకర్షణ. ఆ గెటప్ బావుంది. యాక్షన్ సీన్స్‌లో తన యీజ్ చూపించాడు. అయితే రూబిన్ పాత్ర డైలాగ్ డెలివరీలో బింబిసార ఛాయలు కనిపించాయి.
ఆషికా రంగనాథ్ అందంగా వుంది. తన నటన డీసెంట్‌గా వుంది. బ్రహ్మాజీ పాత్ర కొన్ని నవ్వులు పంచుతుంది. తండ్రి పాత్రలో చేసిన జయప్రకాష్‌తో పాటు మిగత నటులు పరిధిమేర కనిపించారు.
నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. జిబ్రాన్ సంగీతం ఓకే అనిపిస్తుంది. ఎన్నో రాత్రులోస్తాయి గానీ పాట కు మంచి స్పందన వచ్చింది. అయితే అది ఇళయరాజా, బాలకృష్ణల మ్యాజిక్.
సినిమా నేపథ్య సంగీతం థ్రిల్లర్‌కి తగట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటర్ ట్రిమ్ చేయాల్సిన సీన్లు ఉన్నాయి. యాక్షన్‌కి అంత లెంత్ అవసరం లేదనే భావన కలుగుతుంది. గుర్తుపెట్టుకునే మాటలు వినిపించలేదు.
‘డోపెల్‌గాంజర్స్’ అనే కాన్సెప్ట్ తో ఒక థ్రిల్లర్ చూపించాలనే ఆలోచన దర్శకుడిది. ఆలోచన బాగానే వుంది. అయితే ఈ థ్రిల్‌కి ప్రేమకథ అడ్డం తగిలింది. దీంతో పాటు మలుపులు ప్రేక్షకుల ఊహకు ముందే అందిపోవడం, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సాగదీయడంతో ఆ థ్రిల్ కాస్త పలచబడిపోయింది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి… తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా… ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్‌మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)