అర్బన్ నక్సల్స్‌కు నిద్రపట్టట్లే.. ప్రేక్షకులనే మొరిగే కుక్కలంటావా? ప్రకాష్ రాజ్‌‌పై డైరెక్ట్ ఎటాక్

సౌత్ ఇండియన్ పాపులర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) దేశంలో నెలకొన్న సమస్యలపై నిరసన గళం వినిపించడంలో ముందుంటారు. ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వ విధానాలను, దాని మద్దుతుదారులను బహిరంగంగానే ఏకిపారేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) చిత్రంపై ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కశ్మీర్ ఫైల్స్‌ను నాన్సెన్స్ చిత్రంగా తేల్చేసిన ప్రకాష్.. అంతర్జాతీయ జ్యూరీ ఉమ్మివేసినప్పటికీ ఆస్కార్ కోసం అడుగుతున్నారని, దానికి భాస్కర్ అవార్డ్ (Bhasker Award) కూడా రాదన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సదరు చిత్ర దర్శకుడు ప్రకాష్ రాజ్ వీడియోను ట్యాగ్ చేస్తూ తనొక అంధకార్ రాజ్ అని పోస్టు చేశాడు.

కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తన ట్వీట్‌లో ‘ప్రజలు ఆదరించిన కశ్మీర్ ఫైల్స్ అనే చిన్న చిత్రం అర్బన్ నక్సల్స్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. అలాంటి వారిలో ఒకరు వీక్షకులను మొరిగే కుక్కలు అని పిలుస్తూ సినిమా విడుదలై ఏడాది గడిచిన తర్వాత కూడా ఇబ్బంది పడుతున్నారు. మిస్టర్ అంధకార్ రాజ్ నేను భాస్కర్‌ని ఎలా పొందగలను. అది ఎప్పటికీ మీదే’ అంటూ ప్రకాష్ రాజ్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

రీసెంట్‌గా కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ప్రకాష్ రాజ్ ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రం గురించి మాట్లాడారు. కశ్మీర్‌ ఫైల్స్‌ నాన్‌సెన్స్‌ సినిమాల్లో ఒకటని, దాన్ని ఎవరు నిర్మించారో మాకు తెలుసని అన్నారు. అంతర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మివేసినా సిగ్గురాలేదని, ఇంకా ఆ చిత్ర దర్శకుడు నాకెందుకు ఆస్కార్‌ రావడం లేదు? అని అడుగుతున్నాడని కామెంట్ చేశాడు. ఆస్కార్ కాదు కదా అతనికి భాస్కర్‌ అవార్డ్ కూడా రాదని తేల్చేశాడు.

దీనికి కౌంటర్‌గా వివేక్ కూడా ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో ‘ఈ అర్బన్ నక్సల్స్ అందరికీ, ఇజ్రాయెల్ నుంచి వచ్చిన లెజెండరీ ఫిల్మ్ మేకర్‌కు నేను సవాల్ విసురుతున్నాను. వారు సినిమాలోని ఏదైనా ఒక్క షాట్, ఈవెంట్ లేదా డైలాగ్ పూర్తిగా నిజం కాదని నిరూపించగలిగితే నేను ఫిలిం మేకింగ్ నుంచి తప్పుకుంటాను. ప్రతిసారీ ఇండియాకు వ్యతిరేకంగా నిలబడే ఇలాంటి వ్యక్తులే.. మోప్లా, కశ్మీర్ నిజం బయటకు రావడానికి ఎప్పుడూ అనుమతించని వాళ్లు’ అన్నారు.

కాగా.. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం గతేడాది అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది 1990లలో కశ్మీరీ లోయలో హిందువుల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ తదితరులు నటించారు.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *