రోడ్డు ప్రమాదంలో ఏడుగురు స్కూల్ పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని పూజారా కాంకేర్ జిల్లాలో చోటుచేసుకుంది. పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకొస్తున్న ఓ ఆటో.. రాంగ్ రూట్‌లో చాలా వేగంగా వస్తూ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందగా.. మరో విద్యార్ధి, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. కాంకేర్ జిల్లా కోరార్ – భానుప్రతాప్‌పుర్ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డ వారంతా ఐదు నుంచి ఏడేళ్ల వయసున్న చిన్నారులే కావడం బాధాకరం.
హృదయాలను కలిచివేసే ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు రోడ్డుపైనే మృతిచెందగా, మరో ఐదుగురు ఆసుపత్రిలో కన్నుమూశారు. తీవ్ర గాయాలపాలైన ఓ విద్యార్థి, ఆటో డ్రైవర్లను మెరుగైన చికిత్స కోసం రాయ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. ఆటోడ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. రాంగ్ రూట్‌లో వేగంగా వెళ్లి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తామని తెలిపారు.
ఈ ప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. బాధిత కుటుంబాలకు కష్టకాలంలో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. కాంకేర్ జిల్లా ఎస్పీ శలభ్ సిన్హా మాట్లాడుతూ.. ‘‘చిన్నారులను స్కూల్ నుంచి తీసుకెళ్తోన్న ఆటో డ్రైవర్.. హఠాత్తుగా రాంగు రూట్‌లోకి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.. ఇదే ప్రమాదానికి కారణమయ్యింది’’ అని తెలిపారు.
ప్రమాదం తర్వాత కొంత దూరం ఆటోను ఈడ్చుకెళ్లడంతో ట్రక్కు టైర్లు కింద చిన్నారులు నలిగిపోయారు. ఈ దృశ్యాలను చూసిన అటుగా వెళ్తోన్న వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పిల్లలంతా స్థానిక బీఎస్ఎన్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు. సామర్ధ్యానికి మించి విద్యార్థులను ఎక్కించడం ప్రమాదాలకు హేతువుగా మారింది. నలుగురు కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఆటోలో ఎక్కించరాదన్న ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలు గాలికొదిలేశారు.
Read Latest Crime News And Telugu News