పవన్ కళ్యాణ్ నక్సలైట్ అయిపోతాడేమోనని భయపడ్డాను: చిరంజీవి

పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) ఉన్న స్పందించే గుణం చూసి ఒకానొక దశలో నక్సలిజంలోకి వెళ్లిపోతాడేమోనని తనకు భయమేసిందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ప్రముఖ గాయని, ఒకప్పటి పాప్ సింగర్ స్మిత హోస్ట్ చేస్తున్న ‘నిజం విత్ స్మిత’ టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవి అతిథిగా పాల్గొన్నారు. ఇది ఈ టాక్ షో తొలి ఎపిసోడ్. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్‌లో ఈ ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది.

‘పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే సినీ నటుడిగా ఏదంటే మీకు ఇష్టం’ అని చిరంజీవిని స్మిత ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చిరంజీవి చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ‘పవన్ కళ్యాణ్‌ సహజత్వంగా, తన నేచర్‌ను బట్టి అయితే అతను ఏదో ఒక రోజు కచ్చితంగా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. బాధలకు స్పందించే తీరు, ఏదో చేయాలనే తపన చిన్నప్పటి నుంచీ ఉంది. దాని కోసమే ఒకానొక సమయంలో నక్సల్స్‌లోకి వెళ్లిపోతాడేమోనని భయమేసింది. గన్‌లతో ఎక్కువగా ఆడేవాడు. నేను షూటింగ్‌లకు సింగపూర్ వెళ్తే.. అన్నయ్య అక్కడ గన్స్ దొరకుతాయి, ఇక్కడ దొరకట్లేదు తీసుకురా అనేవాడు. అవీ డమ్మీ గన్సే కానీ.. సెమీ ఆటోమేటిక్. అలా గన్‌లతో తిరుగుతుంటే ఒకసారి రైల్వే స్టేషన్‌లో ఆపేశారు. డమ్మీ గన్ అని తెలిశాక వదిలారు. అతనికి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ అందరితో పోల్చుకుంటే వేరే రకం. వాళ్లని ఫ్యాన్స్ అనకూడదు. కల్ట్ అంతే.. భక్తులు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, తనకు మాత్రం భక్తులు ఉంటారు. కాబట్టి నటుడిగా కన్నా రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన అవసరం అతని ఉంది’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇక పవన్ కళ్యాణ్ గురించే మరో విషయాన్ని కూడా ఈ షోలో చిరంజీవి పంచుకున్నారు. సుష్మిత, రామ్ చరణ్‌తో పవన్ కళ్యాణ్ ఉన్న ఫొటోను స్క్రీన్ మీద చూపించగానే.. ‘అందరం ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. వాడికి (పవన్ కళ్యాణ్‌కి) ఆటవిడుపు ఏంటంటే.. వీళ్లిద్దరికీ (రామ్ చరణ్, సుష్మిత) ఒకరి మీద ఒకరికి చెప్పేసి వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే చూసి పైశాచిక ఆనందం అనుభవిస్తూ ఉండేవాడు. సురేఖ వచ్చి ఏంటి కళ్యాణ్ ఇలా చేస్తున్నావ్ అని అడిగితే.. లేదు వదినా వాళ్లు ఆడుకుంటున్నారు అనేవాడు. ఆట కాదది.. రాక్షస క్రీడ అనేది సురేఖ’ అని ఆనాటి జ్ఞాపకాలను చిరంజీవి పంచుకున్నారు.

కాగా, ఒకప్పుడు తెలుగు పాప్ సింగర్‌గా ఒక వెలుగు వెలిగిన స్మిత.. ఆ మధ్య కొన్ని సింగింగ్ కాంపిటీషన్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అలాగే, ఐక్యాండీ ఎంటర్‌టైన్మెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసి టీవీ షోలు చేస్తున్నారు. ఇప్పుడు హోస్ట్‌గా మారి ‘నిజం విత్ స్మిత’ అంటూ కొత్త జర్నీ మొదలుపెట్టారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *