మరిన్ని వెపన్స్ ఇవ్వండి
యూరప్ దేశాలకు జెలెన్ స్కీ విజ్ఞప్తి
ఈయూ పార్లమెంట్లో ప్రసంగం
బ్రసెల్స్ : మిలటరీ సాయం పెంచాలని, మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఈయూ పార్లమెంట్ లో మాట్లాడారు. జెలెన్ స్కీ స్పీచ్‌కు ముందు, తర్వాత ఈయూ పార్లమెంట్ సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ‘‘యూరప్ ఎప్పటికీ ఉంటుంది. మనందరం కలిసి ఉన్నంత కాలం యూరప్ గానే ఉంటుంది. యూరోపియన్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా ప్రయత్నిస్తోంది. కానీ మనం అలా జరగనివ్వొద్దు” అని జెలెన్ స్కీ అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్, ఈయూ పోరాడుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే మోస్ట్ యాంటీ యూరోపియన్ ఫోర్స్.. రష్యా అని కామెంట్ చేశారు. అంతకుముందు ఈయూ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెత్సోలా మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కు లాంగ్ రేంజ్ సిస్టమ్స్, ఫైటర్ జెట్స్ అందించాలని సభ్య దేశాలకు సూచించారు.
ఉక్రెయిన్ తన స్వాతంత్ర్యాన్ని, సమగ్రతను కాపాడుకునేందుకు మద్దతు కొనసాగిస్తామని జర్మనీ చాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ చెప్పారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని, అవసరమైనంత కాలం సాయం చేస్తామని పార్లమెంట్లో తీర్మానం చేశారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి ఈ నెల 24కు ఏడాది అవుతుంది. ఈ క్రమంలో రష్యా దాడులు మరింత పెంచే అవకాశం ఉందని రిపోర్టుల్లో వెల్లడైంది. అందుకే సాయం కోసం జెలెన్ స్కీ సడెన్‌గా ఈయూ పర్యటనకు వెళ్లారు. మొదట బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్స్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ అయ్యారు.
©️ VIL Media Pvt Ltd.