IND vs AUS 1st Test Ball Tampering: భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)పై బాల్ టాంపరింగ్ (Ball Tampering) ఆరోపణల్ని ఆస్ట్రేలియా గుప్పిస్తోంది. నాగ్‌పూర్ వేదికగా గురువారం భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫస్ట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజే ఆస్ట్రేలియా (Australia) టీమ్ 177 పరుగులకి ఆలౌటవగా.. రవీంద్ర జడేజా 47 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఐదు నెలలు ఆటకి దూరంగా ఉన్న జడేజా రీఎంట్రీ అదిరిపోయిందని టీమిండియా ఫ్యాన్స్ కితాబిస్తుండగా.. ఆస్ట్రేలియా కొత్త పల్లవి అందుకుంది.
గురువారం మ్యాచ్ రెండో సెషన్‌లో మహ్మద్ సిరాజ్ నుంచి ఓ క్రీమ్‌ని అందుకున్న రవీంద్ర జడేజా.. తన ఎడమచేతి చూపుడు వేలికి రాసుకుంటూ కనిపించాడు. ఎడమ చేతి వాటం స్పిన్నరైన జడేజా బంతిని తిప్పాలంటే ఆ వేలు చాలా కీలకం. దాంతో జడేజా ఆ క్రీమ్‌తో బాల్ టాంపరింగ్‌కి పాల్పడ్డాడంటూ ఆస్ట్రేలియా ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ మేరకు ఓ వీడియోను కూడా వైరల్ చేసింది. దాంతో టీమిండియా మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది.
మహ్మద్ సిరాజ్ నుంచి జడేజా తీసుకున్నది పెయిన్ రిలీఫ్ క్రీమ్ అని నాగ్‌పూర్ టెస్టు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది. కానీ అనూహ్యంగా ఆస్ట్రేలియా టీమ్ మాత్రం ఈ బాల్ టాంపరింగ్‌పై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేయలేదు. వాస్తవానికి జడేజా క్రీమ్‌ని చేతి వేలికి రాసుకునే సమయానికి ఆస్ట్రేలియా టీమ్ 120/5తో నిలవగా.. అప్పటికే మూడు వికెట్లు కూడా జడేజా పడగొట్టేశాడు. ఆ తర్వాత అతను తీసింది రెండు వికెట్లే.
2018లో ఆస్ట్రేలియా టీమ్ అప్పట్లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడి దక్షిణాఫ్రికా గడ్డపై అడ్డంగా దొరికిపోయింది. అప్పటి కెప్టెన్ స్టీవ్‌స్మిత్, సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సూచనల మేరకు మైదానంలోకి శాండ్ పేపర్‌ని తీసుకొచ్చిన బెన్‌క్రాప్ట్.. బంతిపై రుద్దుతూ కెమెరాలకి చిక్కాడు. దాంతో బెన్‌క్రాప్ట్‌తో పాటు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌పై అప్పట్లో నిషేధం పడింది.
Read Latest
Sports News
,
Cricket News
,