భారత కెప్టెన్ రోహిత్ శర్మ (India captain Rohit Sharma)కి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడు. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం రోహిత్ శర్మతో కలిసి కాసేపు విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ చేశాడు. అయితే.. ఈ క్రమంలో ఓసారి పరుగుకి పిలిచిన విరాట్ కోహ్లీ.. వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దాంతో అప్పుడు సెంచరీకి చేరువలో ఉన్న రోహిత్ శర్మ (Rohit Sharma).. రనౌట్ నుంచి తప్పించుకోవడానికి ప్రమాదకరంగా డైవ్ చేయాల్సి వచ్చింది.
మ్యాచ్‌లో 48వ ఓవర్ వేసిన నాథన్ లయన్ బౌలింగ్‌లో బంతిని మిడ్ వికెట్ దిశగా ఫుష్ చేసిన విరాట్ కోహ్లీ రెండు అడుగులు ముందుకు వేసి సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని రోహిత్ శర్మని పిలిచాడు. దాంతో వేగంగా పరుగు అందుకున్న రోహిత్ శర్మ పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. కానీ.. సడన్‌గా కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బంతి నేరుగా ఫీల్డర్ వద్దకి వెళ్లడంతో.. నో అంటూ కీపర్ ఎండ్ వైపు క్రీజులోకి మళ్లీ వెళ్లిపోయాడు.
కోహ్లీ నో చెప్పే టైమ్‌కి పిచ్ మధ్యలోకి వెళ్లిపోయిన రోహిత్ శర్మ.. మళ్లీ వేగంగా వెనక్కి వచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఫీల్డర్ బంతిని అందుకుని బౌలర్ నాథన్ లయన్‌కి త్రో చేయబోతుండటంతో.. రోహిత్ శర్మ తప్పనిసరి పరిస్థితుల్లో క్రీజులోకి చేరుకునేందుకు ఫుల్ లెంగ్త్ డైవ్ చేశాడు. దాంతో రనౌట్ ప్రమాదం అయితే తప్పింది. కానీ రోహిత్ శర్మ జెర్సీ ముందు భాగం మట్టితో నిండిపోయింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోనే క్షమాపణలు చెప్తూ కనిపించాడు. రోహిత్ శర్మని గత కొన్నేళ్లుగా వెన్ను నొప్పి బాధిస్తోంది. దాంతో హిట్‌మ్యాన్ ఫుల్ లెంగ్త్ డైవ్ చేయడం చాలా అరుదు.
రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత సెంచరీ సాధించి.. చివరికి 212 బంతుల్లో 15×4, 2×6 సాయంతో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ.. కోహ్లీ మాత్రం 26 బంతుల్లోనే 2×4 సాయంతో 12 పరుగులే చేసి వికెట్ చేజార్చుకున్నాడు.
Read Latest
Sports News
,
Cricket News
,