రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఫస్ట్ ఇండియన్ కెప్టెన్‌గా రికార్డ్

India vs Australia 1st Test: భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో శతకం బాదిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈరోజు మ్యాచ్‌లో టీ బ్రేక్ సమయానికి హిట్‌‌మ్యాన్ 207 బంతుల్లో 15×4, 2×6 సాయంతో 118 పరుగులు చేయగా.. అతనికి జోడీగా ఉన్న రవీంద్ర జడేజా కూడా 82 బంతుల్లో 6×4 సాయంతో 34 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా టీమ్ 177 పరుగులకి ఆలౌటవగా టీ విరామానికి 226/5తో నిలిచిన భారత్ 49 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

గురువారం 80 స్ట్రైక్‌రేట్‌తో 69 బంతుల్లోనే 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఈరోజు మాత్రం తొలి రెండు సెషన్లలో చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీ (12), చతేశ్వర్ పుజారా (7), సూర్యకుమార్ యాదవ్ (8) తక్కువ స్కోరుకే ఔటైపోవడంతో స్కోరు బోర్డుని నడిపించే బాధ్యత తీసుకుని హిట్‌మ్యాన్ నెమ్మదిగా ఆడి 171 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టెస్టు కెరీర్‌లో రోహిత్ శర్మ ఇది 9వ సెంచరీకాగా… రెండన్నరేళ్లుగా టెస్టుల్లో శతకం కోసం రోహిత్ శర్మ నిరీక్షిస్తున్న విషయం తెలిసిందే.

క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్‌గా వన్డే, టీ20, టెస్టుల్లో సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే? శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నె దిల్షాన్ టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, పాకిస్థాన్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రమే ఇప్పటి వరకూ ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈరోజు సెంచరీతో రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలోకి సగర్వంగా అడుగుపెట్టాడు. భారత మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీకి ఈ ఘనత సాధ్యం కాలేదు.

Read Latest

Sports News

,

Cricket News

,

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *