రోహిత్ సెంచరీ.. పటిష్ట స్థితిలో టీమిండియా.. ఆధిక్యం ఎంతంటే?

IND vs AUS 1st Test : ఆస్ట్రేలియా (Australia)తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ (India) ఆధిక్యంలో నిలిచింది. ఓవర్ నైట్ స్కోరు 77/1తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా (Team India).. టీ విరామ సమయానికి 80 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 226 పరుగులు చేసింది. దాంతో 49 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. రోహిత్ శర్మ (207 బంతుల్లో 118 బ్యాటింగ్; 15 ఫోర్లు, 2 సిక్సర్లు ), రవీంద్ర జడేజా (82 బంతుల్లో 34 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. వీరిద్దరు అజేయమైన 6వ వికెట్ కు 68 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ టెస్టు కెరీర్ లో 9వ సెంచరీ సాధించాడు. అంతేాకాకుండా కెప్టెన్ హోదాలో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీ బాదిన తొలి భారత ప్లేయర్ గా నిలిచాడు.

అంతకుముందు రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియాను రవిచంద్రన్ అశ్విన్ (23)తో కలిసి రోహిత్ శర్మ ముందుకు నడిపాడు. వీరిద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను ఎదర్కొంటూ పరుగులు సాధించారు. అయితే అరంగేట్రం బౌలర్ మర్ఫీ అశ్విన్ ను అవుట్ చేసి ఆస్ట్రేలియాకు రెండో బ్రేక్ ఇచ్చాడు. ఇక పుజారా (7) దూకుడుగా ఆడే ప్రయత్నంలో స్వీప్ షాట్ కోస వెళ్లి వికెట్ ను చేజార్చుకున్నాడు. దాంతో భారత్ వెంట వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. అయితే కోహ్లీతో కలిసి రోహిత్ మరో వికెట్ పడకుండా లంచ్ బ్రేక్ వరకు టీమిండియాను తీసుకెళ్లాడు.

అయితే లంచ్ బ్రేక్ తర్వాత కథ ఒక్కసారిగా మారిపోయింది. లంచ్ విరామం తర్వాత తొలి బంతికే కోహ్లీ (12) అవుటయ్యాడు. అరంగేట్రం హీరో రవీంద్ర జడేజా (8) లయన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ వెంట వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. అయితే క్రీజులోకి వచ్చిన జడేజా.. రోహిత్ కు అండగా నిలిచాడు. ఈ క్రమంలో వీరిద్దరూ మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ సెంచరీ బాదాడు. మరో ఎండ్ లో కూడా రవీంద్ర జడేజా నిలకడ ప్రదర్శిస్తున్నాడు. అనవసరపు షాట్ల జోలికి వెళ్లకుండా జడేజా ఆడుతున్నాడు. ఈ రోజు మొత్తం భారత్ ఆడి ఆస్ట్రేలియాపై 150 ప్లస్ పరుగుల ఆధిక్యం సాధిస్తే ఈ మ్యాచ్ లో టీమిండియా పై చేయి సాధించినట్లు అవుతుంది.

తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా 63.5 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. జడేజా 5 వికెట్లతో చెలరేగాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. షమీ, సిరాజ్ లు చెరో వికెట్ సాధించారు. ఆసీస్ తరఫున మార్నస్ లబుషేన్ (123 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (37), అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్ కాంబ్ (31) మినహా మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *