రాష్ట్ర రాజధాని అంశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan)ఆశలపై కేంద్రంనీళ్లు చల్లిందన్నారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. రాష్ట్రంలో ఎక్కడినుండైనా ముఖ్యమంత్రి పరిపాలన సాగించవచ్చునని.. కాకపోతే ఆయనతో అధికారులంతా వెళ్లడానికి నిబంధనలు అంగీకరించవన్నారు. రాష్ట్ర విభజన చట్టం 2014 లోని సెక్షన్ 5, 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించి.. ఆ కమిటీ సూచనల మేరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించిన విషయాన్ని లిఖితపూర్వక సమాధానాన్ని సంబంధిత కేంద్ర మంత్రి ఇచ్చారన్నారు. రాజధాని అంశంపై సుప్రీం కోర్టులోనూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తుచేశారు. రాజధానిగా నిర్ణయించిన అమరావతి ప్రాంతంలో సచివాలయం, హైకోర్టు, రాజ్ భవన్ నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపిందని అన్నారు.
తమ అనుమతి లేకుండానే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని కేంద్రం పేర్కొనట్లు రఘురామ వివరించారు. మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర హైకోర్టు కొట్టి వేయగా.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొందన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని మాట్లాడితే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందన్నారు. పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రతిపాదించారని గుర్తు చేశారు. తమ పార్టీ నేతల మాటల్లో పసలేదని.. రాష్ట్ర రాజధాని ఏర్పాటుపై తమకు అధికారం లేదంటూ తమ పార్టీ నేతలు శోకాలు పెట్టడం ఎబ్బెట్టుగా ఉందన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పార్లమెంటులో చేసిన చట్టానికి.. అసెంబ్లీలో సవరణకు ఆస్కారం లేదన్న విషయం తమ పార్టీ నేతలకు తెలియదా అన్నారు. రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పించాలని కోరుతూ గతంలో రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించారన్నారు. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించిన వైఎస్సార్‌సీపీ ఎంపీనే ఈ ప్రశ్నను అడిగినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు. అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒక హెచ్ఆర్ఏ ఇవ్వగా.. ఇప్పుడు విశాఖకు మకాం మారిస్తే మరొక హెచ్ ఆర్ ఏ ఇస్తారా అని ప్రశ్నించారు.
సీఐడీ కస్టడీలో తనని చిత్రహింసలకు గురిచేసిన విషయం ప్రజలందరికీ తెలుసున్నారు రఘురామ. తనని పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురి చేయడాన్ని సవాల్ చేస్తూ తన కుమారుడు సుప్రీం కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. ఈ కేసు ఏడాదిన్నర విచారణకు రాలేదని.. ఈ పిటిషన్ పై హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు తమకు సూచించిందని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు. తమ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తన ప్రాణ రక్షణకు అండగా నిలిచి.. రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాశారని ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆ సమయంలో తనకు మద్దతు తెలిపిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాయిస్ రికార్డింగ్ తప్ప, ఫోన్ ట్యాపింగ్ కాదని ఆయన స్నేహితుడైన మరో వ్యక్తి పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాయని మచ్చ అవుతుందనే ఉద్దేశంతోనే తాను బయటకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ కు సీతా రామాంజనేయులు అనే పోలీసు అధికారి ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందనిజజ మరి సీతారామాంజనేయులుకు ఆ మెసేజ్ ఎవరు పంపారన్న దానికి వారి వద్ద సమాధానం లేదన్నారు. ఫోన్ ట్యాపింగే కాదు.. రికార్డింగ్ కూడా నేరమేన్నారు.
Read Latest
Andhra Pradesh News
and