స్పీల్‌బర్గ్‌తో రాజమౌళి చిట్ చాట్.. ఫిలిం మేకింగ్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌‌‌ ఎందుకో వివరణ

హాలీవుడ్ ఫిలిం మేకర్, ప్రముఖ అమెరికన్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ (Steven Spielberg) రూపొందించిన కొత్త చిత్రం ‘ది ఫాబెల్‌మాన్స్’ (The Fabelmans) శుక్రవారం (ఫిబ్రవరి 10) ఇండియాలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా RRR మూవీతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తెలుగు దర్శకుడు రాజమౌళి.. స్పీల్‌బర్గ్‌ను ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని పొందారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ (Reliance entertainment) యూట్యూబ్ చానల్‌లో ప్రసారమైంది. ఇందులో రాజమౌళి, స్పీల్‌బర్గ్.. ఫిలిం మేకింగ్, వర్కింగ్ స్టైల్‌తో పాటు ప్రొఫెషనల్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయడం గురించి మాట్లాడుకున్నారు.

తన పేరెంట్స్ డివోర్స్, ఫిలిం మేకింగ్‌పై ఇంట్రెస్ట్ కలగడం సహా జీవితంలోని అనేక కీలక క్షణాల గురించి స్పీల్‌బర్గ్ గుర్తుచేసుకున్నారు. ‘ది ఫాబెల్‌మాన్స్’ కథలో విలన్లు లేరని, ఇది ప్రేమకు సంబంధించిన కథ అని చెప్పారు. ఇక భార్యా పిల్లలతో టైమ్ స్పెండ్ చేసేందుకు కెరీర్‌లో తిరస్కరించిన ప్రాజెక్టుల వివరాలు తెలియజేస్తూ.. హ్యారీ పోటర్ ఫిల్మ్ ఫ్రాంచైజీలో మొదటి చిత్రాన్ని అలాగే వద్దనుకున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే తన విషయంలో ఇది విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా రాజమౌళి చెప్పారు. అదృష్టవశాత్తూ తన ఫ్యామిలీ మొత్తాన్ని ఫిలిం బిజినెస్‌లోనే ఉంచుతున్నట్లు తెలిపారు. భార్య, కొడుకు, బ్రదర్స్ అందరూ తనతో పాటు సినిమాలు చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీని మిస్ అవ్వట్లేదని వెల్లడించారు.

రాజమౌళి భార్య రమా రాజమౌళి ఆయన సినిమాలకు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేస్తుందని తెలిసిందే. అలాగే జక్కన్న సినిమాలకు కథ అందించేది ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. కుమారుడు కార్తికేయ నిర్మాత. అలాగే రాజమౌళి కజిన్ బ్రదర్ కాంచి తన టీమ్‌లోనే రచయిత. ఇక మ్యూజిక్ కంపోజర్స్ MM కీరవాణి, కళ్యాణి మాలిక్ గురించి తెలిసిందే.

కాగా.. యంగ్ ఫిలిం మేకర్స్ తక్కువ మాట్లాడాలని, తమ చుట్టూ ఉన్న అనుభవజ్ఞుల మాటలు వినాలని ఈ సందర్భంగా సూచించారు. అందరి సహకారం లేకుండా RRR వంటి చిత్రాన్ని తీయలేరని పేర్కొన్నారు. అంతేకాకుండా RRR చిత్రంలో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్‌ల నటనను కూడా స్పీల్‌బర్గ్ ఈ సందర్భంగా ప్రశంసించారు.

Read Latest

Tollywood updates and

Telugu news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *