హెచ్-1బీ వీసాలో కొత్త నిబంధనలు.. భారతీయ టెక్కీలకు భారీ ప్రయోజనం

H-1B, L1 వీసాలపై వేలాది విదేశీ టెక్కీలకు ప్రయోజనం చేకూర్చే చర్యలో భాగంగా ‘డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్’ను పైలట్ ప్రాతిపదికన తిరిగి ప్రారంభించాలని అమెరికా యోచిస్తోంది. ఈ ఏడాది చివర్లో ప్రారంభించబోయే పైలట్ ప్రాజెక్ట్ పూర్తిగా అమలులోకి వస్తే అమెరికాలోని వేలాది మంది భారతీయ సాంకేతిక నిపుణులకు భారీ ఊరట లభిస్తుంది. 2004 ముందు వరకూ నాన్-ఇమ్మిగ్రంట్ వీసాలు పొందినవారు ముఖ్యంగా H-1B వీసాలను పునరుద్దిరిస్తున్నారు. వీసా గడువు ముగిసిన తర్వాత తమ పాస్‌పోర్ట్‌పై H-1B పొడిగింపు స్టాంపింగ్ కోసం వారి స్వంత దేశానికి వెళ్లవలసి ఉంటుంది. కేవలం ఆ దేశాల్లోని అమెరికా కాన్సులేట్‌లోనే రీ-స్టాంపింగ్ జరుగుతోంది.

ప్రత్యేకించి వీసా నిరీక్షణ సమయం 800 రోజులు లేదా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న సమయంలో ఇది విదేశీ ఉద్యోగులకు అసౌకర్యంగా ఉంది. H-1B వీసాలు ఒకేసారి మూడేళ్ల కాల పరిమితితో జారీ చేస్తారు. H-1B వీసా అనేది వలసేతర వీసా. అమెరికా కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారత్, చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం వేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్నాలజీ కంపెనీలు దానిపై ఆధారపడి ఉంటాయి.

‘‘నిర్దిష్ట పిటిషన్ ఆధారిత NIV కేటగిరీల కోసం ఈ సేవను పునఃప్రారంభించే ప్రణాళికలపై మేము తీవ్రంగా కృషి చేస్తున్నాం.. ఈ ఏడాది చివరలో పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించి, అమలు చేయాలని మేము ఆశిస్తున్నాం.. వీసాల పునరుద్ధరణకు ఇకపై దరఖాస్తుదారులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.. ప్రారంభంలో ఎంత మంది వీసా హోల్డర్లు అర్హులు అనే దానిపై మేము వ్యాఖ్యానించలేం.. అయితే తదుపరి 1-2 సంవత్సరాలలో స్కేలింగ్ చేయడానికి ముందు తక్కువ సంఖ్యతో ప్రారంభమవుతుంది’’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రశ్నకు సమాధానంగా ఇచ్చారు.

వీసాల కోసం పెరిగిపోయిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించడానికి ఇతర దేశాల్లోని దౌత్య కార్యాలయాల్లోనూ వీసాల పరిశీలన ప్రారంభించాలని అమెరికా అధ్యక్షునికి ఒక సలహా సంఘం చేసిన సిఫార్సును అమలు చేసేస్తోంది. అమెరికాలో చదువుకోవడానికి, పర్యటించడానికి, వ్యాపారాలు ప్రారంభించడానికి భారతీయులు పెట్టుకున్న దరఖాస్తుల పరిష్కారానికి 400 నుంచి 800 రోజులకు పైనే పడుతోంది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ ఏడాది ఒక్క జనవరిలోనే లక్షకుపైగా దరఖాస్తులను పరిశీలించింది.

టెక్‌ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడంతో ఉపాధి కోల్పోయిన వేలాది భారతీయ నిపుణులు మళ్లీ ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలుగా హెచ్‌-1బీ వీసా అదనపు గడువు (గ్రేస్‌ పిరియడ్‌)ను 60 రోజుల నుంచి సంవత్సరానికి పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. దీని కోసం అధ్యక్షుడు జో బైడెన్‌కు రెండు భారతీయ అమెరికన్‌ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. హెచ్‌-1బీ వీసా హోల్డర్లు ఉద్యోగం కోల్పోయిన రెండు నెలల్లోగా కొత్త ఉద్యోగం సంపాదించలేకపోతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. ఈ గడువును ఏడాదికి లేదా కనీసం ఆరు నెలలకు పెంచాలని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా, గిట్‌ ప్రో సంస్థలు బైడెన్‌‌కు విజ్ఞ‌ప్తి చేశాయి.

Read Latest International News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *