Constable Jobs: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంత డిమాండా? ఇంజనీర్లు, డాక్టర్లు కూడా పోటీ..!

Constable Jobs:  దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోంది. ఉన్నత చదువులు చదివి చిన్నా చితకా ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. క్వాలిఫికేషన్‌తో సంబంధం లేకుండా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఇదే జరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మహారాష్ట్ర పోలీసులు అతిపెద్ద రిక్రూట్‌మెంట్‌కు ఏర్పాట్లు ప్రారంభించారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు భారీగా పెరిగిన పోటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* ఒక్క పోస్టుకు 100 మంది పోటీ

మహారాష్ట్రలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 6,39,317 మంది గ్రాడ్యుయేట్లు, 68,392 మంది లా, మేనేజ్‌మెంట్, ఇంజినీరింగ్ వంటి విభిన్న సబ్జెక్టులలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన వారు, ఆయుర్వేద వైద్యులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ ఉద్యోగాలకు కనీస అర్హత HSC ఉత్తీర్ణత మాత్రమే. అయినప్పటికీ 18,331 పోస్టులకు దాదాపు 18 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు 100 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాధారణంగా ఏటా సుమారు 6,000 మంది పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. కరోనా మహమ్మారి కారణంగా, గత రెండేళ్లుగా రిక్రూట్‌మెంట్ జరగలేదు.

* భారీ రిక్రూట్‌మెంట్‌కు తెర

రాష్ట్ర పోలీసు దళం చివరకు 2020, 2021కి సంబంధించి ఆగిపోయిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియను 2022 నవంబర్ 9న ప్రారంభించింది. పోలీస్ కానిస్టేబుల్స్, డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్స్, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(SRPF) కోసం రిక్రూట్‌మెంట్ జరుపుతోంది. అదేవిధంగా ముంబై పోలీసులు కూడా 8,070 కానిస్టేబుల్స్, పోలీసు డ్రైవర్ల పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో కేవలం డ్రైవర్‌ పోస్టులు మాత్రమే 994 ఉన్నాయి. మిగిలినవి కానిస్టేబుల్‌ పోస్టులు.

* సెలక్షన్‌ ప్రాసెస్‌

పోలీసు కానిస్టేబుల్‌ సెలక్షన్‌ ప్రాసెస్‌లో ఫిజికల్ టెస్ట్‌లో 1,600 మీటర్ల రన్నింగ్‌, షాట్‌పుట్, పుల్-అప్స్, లాంగ్ జంప్ ఉంటాయి. క్వాలిఫైయింగ్ అభ్యర్థులు తర్వాత రాత పరీక్షకు హాజరుకావాలి. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మొదటి దశలో నైగావ్‌లో, మరోల్ పోలీస్ గ్రౌండ్‌లో పోలీస్ డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

* పోలీసు ఉద్యోగాలకు భారీ డిమాండ్‌

కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ గురించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శిక్షణ, ప్రత్యేక విభాగాలు) సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ల నుంచి 6.4 లక్షల దరఖాస్తులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ల నుంచి 68,392 దరఖాస్తులు అందాయన్నారు. పోలీసు ఉద్యోగాలకు కనిపిస్తున్న డిమాండ్‌ గురించి ఒక రిటైర్డ్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. సమాజంలో గుర్తింపును తీసుకొచ్చే పోలీసు ఉద్యోగానికి ఎక్కువ డిమాండ్‌ ఉందని చెప్పారు. VRS(స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకునే అనుభవజ్ఞులైన పోలీసులకు కూడా చాలా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

థర్డ్ జెండర్ కేటగిరీ కోసం నిబంధనలు రూపొందించాలని బాంబే హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించిన తర్వాత మొత్తం 73 మంది ట్రాన్స్‌జెండర్లు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు 68 మంది, డ్రైవర్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *