నటీనటులు: విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, తణికెళ్ల భరణి, అర్చన గౌతమ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఏకే ఆనంద్
సంగీతం: వెంగీ
నిర్మాత: బీరమ్ శ్రీనివాస్
దర్శకుడు: సురేష్ లంకలపల్లి
ఇండియాలో రెండే మతాలున్నాయి.. ఒకటి సినిమా.. మరోటి క్రికెట్. ఈ రెండింటి కాంబినేషన్‌లో కథ వచ్చిందంటే కచ్చితంగా అది ఆసక్తికరంగానే ఉంటుంది. అలాంటి కథతోనే వచ్చిన సినిమా ఐపీఎల్.. దీనికి ఇట్స్ ప్యూర్ లవ్ అనే క్యాప్షన్ పెట్టారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 10న సినిమా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం..
కథ:
ఇమ్రాన్ ఓ టెర్రరిస్ట్. క్రికెట్‌లో ఇండియా అగ్ర స్థానంలో ఉండటాన్ని చూసి అస్సలు సహించలేక.. దాయాదిదేశం పాకిస్థాన్‌ను నెంబర్ వన్ స్థానంలోకి తీసుకురావాలని అనుకుంటాడు. దానికోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే తన తమ్ముడు సలీం చేత ఇండియాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌లో జట్లను కొంటాడు. మరోవైపు శ్రీరామ్ (నితిన్) మంచి క్రికెటర్. కాకపోతే ఎంత మంచి ఆటగాడైనా కూడా అతి ఆవేశం కారణంగా టీంకు సెలెక్ట్ కాలేడు. మరోవైపు వరుణ్ (విశ్వ కార్తికేయ) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అక్కడ అతని బాస్ జాన్వీ (అర్చనా గౌతమ్)తో ప్రేమలో పడతాడు. మరి ఈ కథలోకి క్రికెట్ ఎలా వచ్చింది.. ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా జరిగాయి..? వాటి వల్ల వరుణ్, శ్రీరామ్‌ల జీవితంలో జరిగిన మార్పులేంటి..? టెర్రరిస్ట్‌ల పన్నాగం పారిందా..? ఇండియా నెంబర్ వన్ స్థానం నుంచి దిగజారిందా అనేది అసలు కథ..
కథనం:
IPL అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా దీనికి పేరుంది. ఇండియన్ క్రికెట్ రూపురేఖల్ని మార్చేసిన పేరు ఇది. అయితే ఇప్పుడు ఇదే పేరుతో సరికొత్త కథను చెప్పడానికి దర్శకుడు సురేష్ రాసుకున్న కథ ఐపిఎల్. దీనికి ఇట్స్ ప్యూర్ లవ్ అనే క్యాప్షన్ పెట్టాడు ఈయన. ఇండియాలో క్రికెట్‌కు వీరాభిమానులుంటారు.. ఇక్కడ దాన్ని ఓ మతంలా చూస్తుంటారు ఫ్యాన్స్. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే క్రికెటర్లను దేవుళ్ల మాదిరి ఆరాధిస్తుంటారు. ఇలాంటి సమయంలో దీన్ని క్యాష్ చేసుకుంటూ ఐపీఎల్ అనే సినిమా చేసి సగం దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు సురేష్. ఇందులో బెట్టింగ్స్ జరిగే తీరు, వాటికి యువత ఎలా అడిక్ట్ అయిందనే విషయాన్ని అంతర్లీనంగా చూపించారు. ఫస్టాఫ్ కాస్త స్లోగా.. కన్ఫ్యూజింగ్‌గా సాగుతుంది. అయితే ప్రథమార్థంలో ఐపీఎల్ మ్యాచ్‌ల చుట్టూ కథ తిరగడంతో అక్కడక్కడా మంచి సన్నివేశాలు పడ్డాయి. సెకండాఫ్ అంతగా ఆకట్టుకోదు. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్‌లు అంత ప్రభావాన్ని చూపించినట్టుగా అనిపించదు.
నటీనటులు:
యువతను మెప్పించేలా వరుణ్, శ్రీరామ్ పాత్రలుంటాయి. వాళ్ళు కూడా బాగానే నటించారు. రెండు పాత్రల్లోనూ నితిన్, విశ్వ కార్తికేయలు ఒదిగిపోయారు. లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్ అని తేడా లేకుండా అన్నిచోట్లా మెప్పించారు వీళ్ళు. హీరోయిన్లుగా కనిపించిన అవంతిక, అర్చనలు అందంగా ఉన్నారు. మిగిలిన వాళ్లంతా బాగున్నారు. తణికెళ్ల భరణి, కుమార్ సాయి, రచ్చ రవి లాంటి వాళ్లు బాగానే నటించారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. పాటలు పర్లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో వేగంగా ఉండాల్సింది. మరోవైపు ఈ సినిమాకు డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. క్రికెట్ అనేది ఆట కాదు.. ఎమోషన్.. అదొక మతం.. అంటూ చెప్పించిన డైలాగ్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంటాయి.
చివరగా ఒక్కమాట:
IPL.. యావరేజ్ క్రికెట్ ప్లస్ లవ్ డ్రామా..
రేటింగ్ 2.5/5