చేయని నేరానికి 14 ఏళ్లు జైలు, 17 ఏళ్ల తర్వాత ఇంటికి.. ఈ యువకుడి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు !

Nizamabad: దుబాయ్‌లో చేయని నేరానికి 14 ఏళ్లు జైలు జీవతం గడిపిన తెలంగాణ యువకుడు 17 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ఓ వ్యక్తి మృతి కేసులో అరెస్టుగా.. అతడికి దుబాయ్ కోర్టు మరణశిక్ష విధించింది. మృతుని కుటుంబం క్షమాబిక్ష ప్రసాదించటంతో అతడు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా మెండోర మండడలానికి చెందిన మాకురి శంకర్‌.. 2006లో ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో ఫోర్‌మన్‌గా పనిలో కుదిరాడు. శంకర్ దుబాయ్‌కు వెళ్లే సమయంలో ఆయన భార్య కడుపుతో ఉంది. కొద్ది రోజుల తర్వాత శంకర్‌ దంపతులకు కుమారుడు జన్మించాడు. ఇక 2009లో శంకర్ స్వగ్రామానికి తిరిగి రావాల్సి ఉండగా.. అనుకోని ఘటన అతని జీవితాన్ని ములుపు తిప్పింది.

శంకర్ పనిచేస్తున్న కంపెనీలో ఓ వ్యక్తి ఆరో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయాడు. విచారణ చేపట్టిన దుబాయ్ పోలీసులు వ్యక్తి చనిపోవటానికి శంకర్‌ కారణమని అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. తాను ఏ తప్పు చేయలేదని.., అతడు ప్రమాదవశాత్తు జారి పడిపోయాడని శంకర్ ఏడ్చి ప్రాధేయపడినా అక్కడి న్యాయస్థానాలు, పోలీసులు పట్టించుకోలేదు. 2013లో దుబాయ్ కోర్టు శంకర్‌కు మరణశిక్ష విధించింది. దీనిపై ఆయన పునఃపరిశీలన కోసం న్యాయస్థానానికి అప్పీలు చేసుకోగా.. విచారణ సాగింది.

శంకర్ మరణశిక్ష నుంచి తప్పించుకోవాలంటే మృతుని కుటుంబం నుంచి క్షమాభిక్ష పత్రం తీసుకురావాలని దుబాయ్ న్యాయస్థానం నిర్దేశించింది. దీంతో శంకర్‌ కుటుంబసభ్యులు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టీడీపీ నేత దేగాం యాదాగౌడ్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆయన దుబాయ్‌లోని న్యాయవాది అనూరాధలను కాంటాక్ట్ చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తిది రాజస్థాన్‌ అని తెలియటంతో శంకర్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి మృతుని కుటంబంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆ మొత్తాన్ని విరాళాల రూపంలో వసూళు చేసి మృతుని కుుటుంబానికి అందించారు. అనంతరం వారు క్షమాభిక్ష పత్రాలపై సంతకం చేయటంతో వాటిని దుబాయ్‌లోని న్యాయస్థానంలో సమర్పించారు. దీంతో అక్కడి న్యాయస్థానం శంకర్‌ను మరణశిక్ష నుంచి విముక్తి చేసింది. వారం రోజుల కిందట జైలు నుంచి విడుదలైన శంకర్ నిన్న (శుక్రవారం) దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు.

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *