శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం, మూల వర్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది.
నేడు ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుంచి 8.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఉదయం 8.40 నుంచి 9 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
11-02-2023
ధ్వజారోహణం పెద్దశేష వాహనం
12-02-2023
చిన్నశేష వాహనం హంస వాహనం
13-02-2023
సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
14-02-2023
కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
15-02-2023
పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
16-02-2023
హనుమంత వాహనం స్వర్ణరథం, గజ వాహనం
17-02-2023
సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
18-02-2023
రథోత్సవం అశ్వవాహనం
19-02-2023
చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం శ్రీవారిని 57,702 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.43 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. స్వామివారికి 27,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండగా.. స్వామివారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నేడు శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఈ నెల 22 నుంచి 28 వరకూ అంగ ప్రదక్షిణ టోకెన్లు ఆన్‌లైన్‌లో 11 గంటలకు విడుదలు చేస్తున్నారు. భక్తులు టోకెన్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అలాగే ఈ నెల 13న ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఆన్‌లైన్ కోటా టికెట్లు విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది.