Click here to see the BBC interactive
కొత్త మెట్రో లైన్ ఆవిష్కరణతోపాటు ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 19న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబయి వచ్చారు. నెల రోజుల పూర్తికాకముందే, ఫిబ్రవరి 10న ఆయన మరోసారి ముంబయికి చేరుకున్నారు.
ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి షిర్డీ, సోలాపుర్‌లకు వెళ్లే రెండు ‘‘వందే భారత్’’ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపేందుకు మోదీ ఇక్కడకు వచ్చారు. అయితే, దీనిపై కంటే ముస్లింలోని దావూదీ బోహ్రా వర్గం నిర్వహించిన ఒక కార్యక్రమానికి మోదీ హాజరుకావడంపై ప్రస్తుతం ఎక్కువ చర్చ జరుగుతోంది.
తూర్పు అంధేరీలోని బోహ్రా ముస్లిం వర్గానికి చెందిన ‘అరబిక్ అకాడమీ’ని ప్రారంభించేందుకు మోదీ ఇక్కడకు వచ్చారు. మోదీతోపాటు దావూదీ బోహ్రా వర్గ అధిపతి సయ్యదానా ముఫదల్ సైఫుద్దీన్ ఆ వేదికను పంచుకోవడంపై కూడా చర్చ జరుగుతోంది.
దావూదీ బోహ్రా కార్యక్రమంలో నరేంద్ర మోదీ పాలుపంచుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 2018లో ఇందౌర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలోనూ మోదీ పాల్గొన్నారు.
- మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?
- అస్సాం: ‘మా ఇళ్లు కూల్చడానికి బదులు మమ్మల్ని చంపేయండి’
ఏం సందేశం ఇస్తున్నారు?
మధ్యప్రదేశ్ అసెంబ్లీతోపాటు మహారాష్ట్ర నగర పాలిక ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. దీంతో ముంబయిలో తాజా కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా దావూదీ బోహ్రా ముస్లింలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నరేంద్ర మోదీతోపాటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూడా హిందూత్వ రాజకీయాలతో ముందుకు వెళ్తోందని తరచూ విమర్శలు వినిపిస్తుంటాయి. పార్టీకి చెందిన కొందరు నాయకులు కూడా తరచూ ముస్లింలపై విమర్శలు చేసేవారు.
అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా ముస్లింలలోని కొన్ని వర్గాలకు చేరువయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ముస్లింలలో ఆర్థికంగా వెనుకబడిన పస్మాందా వర్గాలకు కూడా చేరువయ్యేందుకు కూడా కార్యక్రమాలు నిర్వహించారు.
అదే సమయంలో ముస్లింలలో ఆర్థికంగా బలమైన వర్గంగా భావించే దావూదీ బోహ్రాలను కూడా తమతో కలుపుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
దేశంలోని మొత్తం ముస్లింల జనాభాలో దావూదీ బోహ్రా వర్గాల వాటా దాదాపు పది శాతం వరకు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువమంది గుజరాత్, మహారాష్ట్రల్లో స్థిరపడ్డారు.
అయితే, గుజరాత్‌లోని బోహ్రా ముస్లింలు మొదట్నుంచీ తమవైపే ఉన్నారని బీజేపీ చెబుతూ వస్తోంది. అయితే, త్వరలో జరగబోతున్న ముంబయి మహా నగరపాలిక (బీఎంసీ) ఎన్నికల్లోనూ కొన్ని స్థానాల్లో ఫలితాలను ప్రభావితంచేసే స్థాయిలో బోహ్రాలు ఉన్నారు. దీంతో వారి కార్యక్రమానికి మోదీ రావడంపై చర్చ జరుగుతోంది.
మరోవైపు దావూదీ బోహ్రాలకు చేరువయ్యేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన కూడా ప్రయత్నిస్తోంది.
- మోదీ బీజేపీ మీద పోరాటంలో హిందువులు, ముస్లింల మధ్య నలిగిపోతున్న కాంగ్రెస్
- నరేంద్ర మోదీ: ప్రధాని హిందుత్వ ఇమేజ్.. ఇస్లామిక్ దేశాలతో సంబంధాలకు అవరోధం కాలేదు.. ఎందుకు?
ముస్లింల ఓటు బ్యాంకు..
ముంబయి జనాభాలో హిందువుల తర్వాత స్థానం ముస్లింలదే. వీరు 50కిపైగా వార్డుల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలరు. మరోవైపు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లోని జనాభా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ స్వల్ప ఓట్ల తేడాతోనూ జయాపజయాలు మారిపోతుంటాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం, ముంబయిలో మొత్తం ముస్లింల వాటా 20.65 శాతం వరకూ ఉంటుంది. మొదట్లో వీరు గంపగుత్తంగా కాంగ్రెస్‌కు ఓటు వేసేవారు. ఆ తర్వాత వీరిలో కొందరు సమాజ్‌వాదీ పార్టీ వైపు వెళ్లారు. ఆ తర్వాత నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఎంఐఎంలవైపు వారు చూడటం మొదలుపెట్టారు.
మరోవైపు శివసేనపై కూడా మొదట్నుంచీ పక్కా హిందూత్వ పార్టీ ముద్ర ఉండేది. అయితే, 2017లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో మొత్తంగా ఎన్నికైన 31 మంది ముస్లిం కార్పోరేటర్లలో ఇద్దరు శివసేన నుంచి గెలిచారు. అయితే, ఎక్కువ మంది ముస్లిం కార్పోరేటర్లు ఇప్పటికీ కాంగ్రెస్‌కు చెందినవారే.
కానీ, ప్రస్తుత ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారినట్లు కనిపిస్తున్నాయి. ‘మహా వికాస్ అఘాడీ’ కూటమిలో కాంగ్రెస్, ఎన్‌సీపీతో జతకట్టిన శివసేన తమపై ఉన్న హిందూత్వ ముద్రకు కాస్త దూరం జరిగి, ముస్లింలు కూడా తమకు మద్దతు తెలపాలని కోరుతోంది.
- ఫిఫా ప్రపంచ కప్ వేదికగా ఖతార్ మత ప్రచారం చేసిందా
- అరబ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులపై ముస్లిం విద్వేష రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుంది
దసరానాడు నిర్వహించిన సభలో పార్టీ నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే.. బిల్కిస్ బానో కేసు గురించి కూడా ప్రస్తావించారు. మరోవైపు ప్రకాశ్ అంబేడ్కర్ పార్టీ కూడా కలవడంతో శివసేనకు దళిత, ముస్లిం ఓటు బ్యాంకు పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటు బీజేపీ కూడా ముస్లిం ఓటర్లను కూడా ఆకర్షించడం ద్వారా బీఎంసీని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
హిందూత్వ రాజకీయాలతో బీజేపీ దూకుడుగా వెళ్తున్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాల్లో ముస్లింలలోని కొన్ని వర్గాలకు పార్టీ చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుత బీఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దావూదీ బోహ్రా కార్యక్రమానికి మోదీ హాజరయ్యారా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
‘‘పెద్ద నాయకులు వేసే ప్రతి అడుగు వెనుకా రాజకీయాలు ఉంటాయి’’అని రాజకీయ విశ్లేషకురాలు, సీనియర్ జర్నలిస్టు మృణాలినీ నానివ్‌డేకర్ చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా బీజేపీ రాజకీయాలను మృణాలినీ విశ్లేషిస్తున్నారు.
‘‘దావూదీ బోహ్రాల ఓట్లు మొత్తం ముస్లిం ఓట్లలో పది శాతం వరకు ఉంటాయి. అయితే, దేశంలోని చాలా ప్రాంతాల్లో ముస్లిం ఓట్లను బీజేపీకి వ్యతిరేకంగా కూడగట్టేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ కూడా బీజేపీని అడ్డుకునేందుకు ముస్లింలు శివసేన వైపు వెళ్లే అవకాశముందని విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే దావూదీ బోహ్రాల కార్యక్రమానికి హాజరుకావడం ద్వారా తాము ముస్లింలకు వ్యతిరేకంకాదనే సందేశాన్ని నరేంద్ర మోదీ, బీజేపీ నాయకులు ఇవ్వాలని చూస్తున్నారు’’అని ఆమె అన్నారు.
- ‘మొహమ్మద్ ప్రవక్త కూతురు కథ’ సినిమాను పలు ముస్లిం దేశాలు ఎందుకు నిషేధిస్తున్నాయి? బ్రిటన్ థియేటర్లలో ప్రదర్శన రద్దుపై ప్రజల స్పందన ఏమిటి?
- కామసూత్ర: అరబ్ దేశాల శృంగార సాహిత్యంలో ఏముంది?
బోహ్రాలతో మోదీ సంబంధాలు..
బోహ్రాల కార్యక్రమానికి మోదీ హాజరుకావడం వెనుక రాజకీయ కారణాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నప్పటికీ, బీజేపీ ఆ వార్తలను ఖండిస్తోంది. బోహ్రాలతో మోదీకి ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయని పార్టీ చెబుతోంది. దక్షిణ గుజరాత్‌లో బోహ్రాలు పెద్ద సంఖ్యలో ఉంటారని, వారితో మోదీకి మంచి అనుబంధముందని వివరిస్తోంది.
ఈ అంశంపై మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మాధవ్ భండారి మాట్లాడుతూ.. ‘‘బోహ్రాలతో మోదీ అనుబంధం ఈనాటిది కాదు. 2012లో సూరత్‌లో బోహ్రాల సమావేశం జరిగింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగానున్న బోహ్రాలు హాజరయ్యారు. నేను కూడా అక్కడకు వెళ్లాను. అప్పుడే సైఫుద్దీన్‌ను కలిశాను. ఆయన నన్ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. బీజేపీ, మోదీతో వారికి సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయని ఆయన చెప్పారు. మేం కూడా అన్ని అంశాల్లోనూ సహకరిస్తామని వారికి మాట ఇచ్చాం’’అని చెప్పారు.
అయితే, అప్పట్లో రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో మోదీ ఆ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆయన వివరించారు.
- ఔరంగజేబు: 300 ఏళ్ల క్రితం మరణించిన మొఘల్ చక్రవర్తి గురించి ఇప్పుడెందుకు చర్చ జరుగుతోంది
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
ఎన్నికలతో సంబంధం లేదు..
బోహ్రాల కార్యక్రమానికి మోదీ హాజరుకావడానికి త్వరలో జరగబోతున్న ఎన్నికలకు ఎలాంటి సంబంధమూలేదని మాధవ్ భండారి చెప్పారు.
‘‘దాదాపు ఎనిమిది నెలల క్రితమే ఈ కార్యక్రమానికి షెడ్యూల్ కుదిరింది. అప్పట్లో అసలు ఎన్నికల ఊసే లేదు. ఇప్పుడు ఎన్నికలు రావడం యాదృచ్ఛికం. ఒకవేళ ఈ కార్యక్రమం తర్వాత ఏదైనా రాజకీయ లబ్ధి జరిగితే జరగొచ్చు. మేం కాదని చెప్పడం లేదు. కానీ, మా ప్రధాన ఉద్దేశమైతే అదికాదు’’అని ఆయన అన్నారు.
అయితే, త్వరలో జరగబోతున్న ఎన్నికలే లక్ష్యంగా ఇక్కడ ముస్లింలకు చేరువయ్యేందుకు బీజేపీ, ఇతర పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని మృణాలినీ వ్యాఖ్యానించారు.
‘‘ఈ వారంలోనే భిండీ బజార్‌లో జరిగిన బోహ్రా ముస్లింల కార్యక్రమానికి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా హాజరయ్యారు. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన అమీన్ పటేల్ కూడా అక్కడకు వచ్చారు. ఇవన్నీ ఎన్నికల వ్యూహాలు కాక మరేమిటి?’’అని ఆమె ప్రశ్నించారు. అయితే, బోహ్రాలు ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తారని కూడా మనం భావించకూడదని మృణాలినీ అన్నారు.
‘‘దావూదీ బోహ్రాలు కాస్త ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంటారు. మిగతా ముస్లింల కంటే వీరు భిన్నమైన వారు. 2005లో ముంబయిలో వీరు సైఫీ ఆసుపత్రిని ప్రారంభించినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించారు. సూరత్‌లో ఏడు దశాబ్దాల క్రితం నిర్వహించిన ఒక భారీ దావూదీ బోహ్రా కార్యక్రమానికి అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హాజరయ్యారు. వీరికి కాంగ్రెస్‌తోనూ మంచి అనుబంధమే ఉంది. కాబట్టి ముస్లింలలో ఈ వర్గం బీజేపీకి అనుకూలమని మనం అనుకోకూడదు. కానీ, నేడు వీరి కార్యక్రమానికి మోదీ హాజరుకావడం అనేది చాలా ముఖ్యమైన విషయం’’అని ఆమె అన్నారు.
- జ్ఞాన్‌వాపి మసీదు: ఫౌంటైన్‌లు కరెంటు లేకుండా ఎలా పని చేస్తాయి, వాటి చరిత్ర ఏంటి?
- జ్ఞాన్‌వాపి మసీదు: బాబ్రీ తరువాత మరో మత రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోందా?
బోహ్రాలు ఎందుకు ముఖ్యం?
గుజరాతీ పదం ‘‘బహౌరావు’’ నుంచి బోహ్రా అనే పదం వచ్చింది. బహౌరావు అంటే వ్యాపారం అని అర్థం. 11వ శతాబ్దంలో వీరి పూర్వీకులు ఉత్తర ఈజిప్టు నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లుగా భావిస్తున్నారు.
అయితే, 1539లో కొందరు యెమెన్ నుంచి కూడా సిద్ధ్‌పుర్(గుజరాత్)కు వచ్చారు. 1588లో 30వ సయ్యిదానా మరణం తర్వాత ఆయన వారసులు దావూదీ బిన్ ఖుతుబ్ షా, సులైమాన్ షాల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో వీరు రెండు వర్గాలు విడిపోయారు.
దావూదీ బిన్ ఖుతుబ్ షా వర్గాన్ని దావూదీ బోహ్రాగా, సులైమాన్ వర్గాన్ని సులైమాన్ బోహ్రాగా పిలుస్తారు. అయితే, దావూదీ బోహ్రాలతో పోలిస్తే, సులైమాన్ బోహ్రాల జనాభా చాలా తక్కువగా ఉంటుంది.
అయితే, 46వ దావూదీ బోహ్రా సయ్యిదానా మరణం తర్వాత మళ్లీ వీరు విడిపోయి రెండు కొత్త వర్గాలు ఏర్పడ్డాయి. నేడు భారత్‌లో మొత్తంగా బోహ్రాల జనాభా 20 లక్షల వరకు ఉంటుంది. వీరిలో దావూదీ బోహ్రాల వాటా 12 లక్షలు. మిగతా 8 లక్షలు బోహ్రాల్లోని ఇతర వర్గాలకు చెందినవారు ఉంటారు.
సులైమానీలను సున్నీ బోహ్రాలుగా పిలుస్తారు. వీరు హనాఫీ ఇస్లామిక్ చట్టాలను అనుసరిస్తుంటారు. దావూదీ బోహ్రాలను ఇస్మాయిలీ షియా వర్గంగా చెబుతారు. వీరు దాయిముల్ ఇస్లాంను అనుసరిస్తారు.
దావూదీ బోహ్రాల్లో కేవలం తమ వర్గంలో ఉండే వారిని మాత్రమే పెళ్లి చేసుకోవడం లాంటి కొన్ని పురాతన సంప్రదాయాలు ఇప్పటికీ ఉన్నాయి. వీరు కొన్ని హిందూ సంప్రదాయాలను కూడా అనుసరిస్తుంటారు.
గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్, వడోదర, జామ్‌నగర్, రాజ్‌కోట్, నవ్‌సారీ, దాహోద్, గోద్రాలలో దావూదీ బోహ్రాల జనాభా ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు మహారాష్ట్రలోని ముంబయి, పుణె, నాగ్‌పుర్, ఔరంగాబాద్‌లతోపాటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్, భిల్వాడా, మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్, బుర్హాన్‌పుర్, ఉజ్జయిని, షాజాపుర్‌లలోనూ దావూదీ బోహ్రాలు పెద్ద సంఖ్యలో ఉంటారు.
కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ చాలా మంది దావూదీ బోహ్రాలు స్థిరపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: ఫార్ములా ఈ రేస్ ప్రత్యేకత ఏమిటి… తెలంగాణకు అవకాశం ఎలా వచ్చింది
- భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి?
- అప్పర్ భద్ర: ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమకు నీళ్లు అందవా… ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకత ఎందుకు
- రాణి రూపమతి: భర్తను ఓడించిన శత్రువును పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి విషం తాగిన రాణి
- చాట్‌జీపీటీ: డిగ్రీ కూడా పాసవని సామ్ ఆల్ట్‌మాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు.. ఇంతకీ ఎవరీయన?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)