ఓ వైపు వయోవృదుడు.. మరో వైపు అసమర్థుడితో తెలుగు దేశం పార్టీ నలిగి పోతోందన్నారు ఏపీ మంత్రి రోజా. లోకేష్ పాదయాత్ర రోజు రోజుకి జోకేష్ పాదయాత్రలా మారుతోందని ఎద్దేశా చేశారు. యువగళం జబర్దస్త్‌కి పోటీగా నిలబడుతోందని.. లోకేష్ నగరి నియోజకవర్గంలోకి వస్తే ఏమవుతుందో.. తమ ప్రజలంతా బాగుండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను అన్నారు. నారా లోకేశ్‌ను చూస్తే బాధేస్తోందని.. నడవలేక పాపం అంటూ సెటైర్లు పేల్చారు. లోకేష్‌పై మహేష్‌బాబు రేంజ్‌లో డైలాగ్ పేల్చారు.
చంద్రబాబుకు చివరి అవకాశం ఇస్తే ఆంధ్ర ప్రజలకు ఇదే చివరి రోజులు అవుతాయన్నారు మంత్రి. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే శాశ్వత కట్టడాలు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విడగొట్టి అప్పులపాలు చేసిన ఘనత చంద్రాబాబుదేనని ధ్వజమెత్తారు. పరిపాలన వికేంద్రకరణ వల్ల వెనకబడిన ప్రాంతాలకుఎంతో మేలు జరుగుతుందన్నారు.
రాయలసీమకు న్యాయ రాజధాని రావడం రాయలసీమ బిడ్డగా తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు రోజా. విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ వచ్చి మంత్రుల కార్లని పగలకొట్టి పక్క దారి పట్టించాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఉన్న డ్యాంల ఎత్తును పెంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు మంత్రి.